March 27, 2026

ఆంధ్రాలో సముద్రపు దొంగలు : విశాఖ నుండి నెల్లూరు ఇదో మాఫియా !

సముద్రపు దొంగలు ఎక్కడుంటారో ఎవరికి తెలియదు. పడవలపై సంపదను దోచుకుంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సముద్రపు దొంగలు అనునిత్యం మనతీర ప్రాంతంలోనే మన కోస్టల్ పోలీసుల కంటే ఎక్కువగా గస్తీ కాస్తుంటారు. గస్తీ కాస్తుంటే, వీరిని దొంగలు అంటారేంటి? అదే మరి తిరకాసు. వీరేం దేశ సేవ చేయడానికో, ప్రజారక్షణ కోసమో కాదు. సముద్రాన్ని దోచుకోవడానికి. సముద్రాన్ని దోచుకోవడం ఏంటి? మళ్ళీ ప్రశ్న. అదేనండీ, తీర ప్రాంతంలో ఉండే ఇసుకను దోచుకోవడానికి అక్కడే గస్తీ కాస్తుంటారు.సూదీర్ఘమైన ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని అడుగులెక్కన లెక్కెట్టి మరీ దోచేస్తున్నారు. అదేలాగో మీరే చదవండి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1,053 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ప్రస్తుతం అక్రమార్కుల చెరలో చిక్కుకుంది. కేవలం విశాఖపట్నం మాత్రమే కాకుండా శ్రీకాకుళం, కోనసీమ, నెల్లూరు జిల్లాల తీరప్రాంతాల్లో సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు, ఆక్రమణలు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తూ సామాన్య ప్రజల ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్నాయి. ఈ ఇసుకను భవన నిర్మాణాలకు వినియోగించడం వలన భారీ ప్రమాదాలు సంభవించే అవకాశం చాలా ఎక్కువ. నిఘా, పర్యవేక్షణ తక్కువగా ఉండడంతో చాలా సులువుగా మాఫియా యథేచ్చగా అక్రమాలకు పాల్పడుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,500 హెక్టార్లలో అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని గార, రణస్థలం మండలాలు మరియు కోనసీమ జిల్లాలోని మలికిపురం, సాఖినేటిపల్లి మండలాల్లో సముద్ర తీరప్రాంత ఇసుక దిబ్బలను తోడేస్తున్నారు. దీనివల్ల తీర ప్రాంత క్షయం (Coastal Erosion) పెరిగి, సముద్రపు నీరు భూగర్భ జలాల్లోకి చొచ్చుకురావడం (Saline Water Intrusion) వంటి తీవ్రమైన పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. కోనసీమలోని పలు గ్రామాల్లో సుమారు లక్ష కొబ్బరి చెట్లు ఈ ఉప్పునీటి ప్రభావం వల్ల ఎండిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

విశాఖ, అనకాపల్లి జిల్లాల తీరప్రాంతాల్లోని రాంబిల్లి, నక్కపల్లి, పాయకరావుపేట వంటి మండలాల్లో సముద్ర తీరప్రాంతాలను మాఫియా ఇసుక తోడేస్తున్నారు. సముద్రపు ఇసుకను నది ఇసుకలో కలిపి అమ్మడం ద్వారా ప్రజలను మోసం చేయడమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణగా ఉండే ఇసుక దిబ్బలను కరిగించేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం మరియు నిర్మాణ రంగంలో పెరిగిన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. స్థానిక మత్స్యకారులు తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన చెందుతున్నా, మైనింగ్ మరియు రెవెన్యూ శాఖల నుండి ఆశించిన స్థాయిలో చర్యలు ఉండటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల కాలంలో ఉపముఖ్యమంత్రి మడ అడవుల గురించి మాట్లాడారు. మడ అడవులు తరిగిపోతున్నాయి. ఫలితంగా పర్యావరణ సమస్యలతోపాటు కొబ్బరి తోటలకు నష్టం వాటిల్లుతోందని వ్యాఖ్యానించారు. మడ అడవులు తగ్గిపోవడం వెనుక ఈ మాఫియా ఘనకార్యం చాలా ఎక్కువగా ఉంది.

కోనసీమ మంచినీటికి కరువే

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శంకరగుప్తం, కేశనపల్లి వంటి గ్రామాల్లో సముద్రపు ఇసుకను విచ్చలవిడిగా తవ్వడం వల్ల సముద్రపు నీరు పంట పొలాల్లోకి ప్రవేశించింది. దీనివల్ల వేల ఎకరాల వరి పంట దెబ్బతినడమే కాకుండా, తాగునీరు కూడా కలుషితమై ప్రజలు నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

శ్రీకాకుళం – రెడ్ జోన్ : జిల్లాలోని 25 కిలోమీటర్ల తీరప్రాంతం ఇప్పటికే ‘రెడ్ జోన్’గా ప్రకటించబడింది. నాగావళి నది సంగమ ప్రాంతాల్లో అక్రమ తవ్వకాల వల్ల నదులు తమ దిశను మార్చుకుంటున్నాయి. గార మండలంలో మడ అడవులను (Mangroves) కార్పొరేట్ సంస్థలు ధ్వంసం చేయడం వల్ల సముద్ర తీరం కోతకు గురవుతోంది.

నెల్లూరు – పెన్నా తీరంలో దందా: నెల్లూరు జిల్లాలోని జొన్నవాడ, మినగల్లు, పల్లెపాడు వంటి ప్రాంతాల్లో రాత్రివేళల్లో యంత్రాల సహాయంతో వేలాది టన్నుల ఇసుకను తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్నారు. భూగర్భ జలాలు అట్టడుగుకు పడిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు నిరసనలు తెలుపుతున్నారు.

ప్రకృతి వైపరీత్యాల ముప్పు:

తీర వెంబడి రక్షణగా ఉండే ఇసుక తిన్నెలను తొలగించడం వల్ల తుపాన్ల సమయంలో సముద్రపు అలలు నేరుగా గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో దాదాపు 28.7% భాగం ఇప్పటికే కోతకు గురైందని సెంట్రల్ జియోఫిజిక్స్ విభాగం హెచ్చరించింది.

ప్రాణ నష్టం: కోనసీమలో ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన భారీ గుంతల్లో పడి గత ఏడాదిలోనే ఎనిమిది మంది యువకులు మృతి చెందడం ఆవేదన కలిగించే విషయం. అక్రమార్కులు తీసిన గుంతలు నీటితో నిండి ఉండటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.

నిర్మాణాలకు ముప్పు: సముద్రపు ఇసుకలో లవణాల (ఉప్పు) శాతం ఎక్కువగా ఉండటం వల్ల దానిని సిమెంట్ కలిపి వాడితే గోడలు త్వరగా బీటలు వారుతాయి. దీనివల్ల భవనాల జీవన కాలం సగానికి పైగా తగ్గిపోయి, కుప్పకూలే ప్రమాదం ఉంది.

పర్యావరణ విధ్వంసం: తీరం వెంబడి ఉండే ఇసుక దిబ్బలు తుపాన్లు, సునామీల సమయంలో సహజ రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. వీటిని తవ్వేయడం వల్ల సముద్రపు నీరు గ్రామాల్లోకి చొచ్చుకువచ్చే ప్రమాదం ఉంది.

మత్స్యకారుల ఇబ్బందులు: ఇసుక తరలింపు కోసం తీరం వెంట భారీ గోతులు తీయడం వల్ల రాత్రివేళల్లో వేటకు వెళ్లే మత్స్యకారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తీర ప్రాంతంలోని జీడి మామిడి వంటి తోటలను కూడా ఈ మాఫియా నాశనం చేస్తోంది.

కల్తీ ఇసుక దందా: నది ఇసుకలో సముద్రపు ఇసుకను కలిపి భవన యజమానులకు అంటగడుతున్నారు. దీనివల్ల ప్రజలు భారీగా డబ్బు వెచ్చించినా నాసిరకం ఇసుకతో ఇళ్లు నిర్మించుకోవాల్సి వస్తోంది.

నిఘా వైఫల్యం: రాంబిల్లి వంటి మండలాల్లో ఏకంగా సముద్ర తీరంలోకి రోడ్లు వేసి మరీ తవ్వకాలు సాగిస్తున్నా, మైనింగ్ అధికారులు కేవలం ఫిర్యాదులు అందినప్పుడే స్పందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

దాడులకు తెగబడుతున్న మాఫియా

ఉదాహరణకు, శ్రీకాకుళంలోని పాతూరు గ్రామంలో గ్రామస్థులు అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాఫియా వారిపై దాడులు చేసింది. పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సామాన్యుల ప్రయత్నాలను రాజకీయ అండదండలతో తొక్కివేస్తున్నారు. పర్యవసానంగా, సుప్రీంకోర్టు మరియు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినా, క్షేత్రస్థాయిలో నిఘా లోపం వల్ల అక్రమాలు ఆగడం లేదు.

#APCoastline #SaveNature #SandMafia #EnvironmentalCrisis #AndhraPradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *