March 27, 2026

ఆదిలాబాద్‌కు ‘ఎయిర్‌బస్’.. ఏడాదిలోపే విమానాశ్రయ పనులు: సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన జిల్లాకు పలు వరాలు ప్రకటించారు. “ఎర్ర బస్సు ఎరుగని ప్రాంతంలో ఎయిర్‌బస్సు దింపుతాం” అని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఏడాది లోపు విమానాశ్రయ పనులు ప్రారంభిస్తామని, దీని కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శిలాఫలకం వేయిస్తామని ప్రకటించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు కూడా ఈ ప్రాజెక్టుకు సహకరిస్తారని తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిని ఇంద్రవెల్లి లేదా కొమురం భీం పేరుతో ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, స్థానిక ప్రజాప్రతినిధులు స్థలాన్ని ఖరారు చేస్తే వెంటనే అనుమతులు ఇస్తామని చెప్పారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని స్పష్టం చేశారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పరిశ్రమను మళ్ళీ ప్రారంభించేందుకు కృషి చేస్తానని, ఆదిలాబాద్‌ను ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి తన ప్రసంగంలో అభివృద్ధికి రాజకీయం అడ్డుకాకూడదని, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.

#Adilabad #RevanthReddy #TelanganaNews #AdilabadAirport #IndravelliUniversity #PranahitaProject #TelanganaDevelopment #CMRevanth #NirmalPublicMeeting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *