March 26, 2026

తొలుత జెట్ విమానాలు నేల కూలాయి.. కానీ: సీడీఎస్

  • కానీ వ్యూహాలు మార్చి పాక్‌ను తీవ్రంగా బాదాం
  • యుద్ధం ఎప్పుడూ అణు స్థాయికి చేరలేదు
  • ఇరు దేశాలూ మితంగానే స్పందించాయి

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) మరియు పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై భారత వాయుసేన మే 7న నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” దాడుల్లో కొన్ని యుద్ధ విమానాలను భారత్ కోల్పోయిందని, అయితే ఆ తరువాత వ్యూహాన్ని మార్చి, మే 10న పాకిస్తాన్ గుండె భాగాల్లో ఉన్న వైమానిక స్థావరాలను విజయవంతంగా లక్ష్యంగా చేసామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు.

సింగపూర్‌లో శాంఘ్రిలా డైలాగ్ సందర్భంగా రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ టీవీలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన మాట్లాడుతూ, భారత విమాన నష్టాల సంఖ్యను తాను వెల్లడించనప్పటికీ, మూడు రాఫెల్ విమానాలు సహా ఆరు విమానాలను కూల్చినట్టు పాకిస్తాన్ చెబుతున్నది పూర్తిగా తప్పు అని స్పష్టం చేశారు. యుద్ధ విమానాలు ఎన్ని కూలాయానే అంశంకంటే ఎందుకు కూలాయనే అంశాన్ని పరిశీలించామన్నారు. తప్పులను సవరించుకుని మళ్ళీ తిరుగులేని దాడులు చేశామని ఆయన చెప్పారు.

“మే 7న తొలిదశలో నష్టాలు కలిగాయి. అయితే రెండు రోజుల్లోనే మేం ఆ వ్యూహాన్ని పునరాలోచించాం, సరిచేసాం. మళ్లీ విమానాలను పాకిస్తాన్ లోపల 300 కిలోమీటర్ల లోతు వరకు పంపించి, మీటర్ స్థాయిలో ఖచ్చితంగా లక్ష్యాలను ధ్వంసం చేశాం,” అని CDS పేర్కొన్నారు.

రేషనల్‌గానే వ్యవహరించిన ఇరుపక్షాలు

మే 7 నుంచి 10 వరకు జరిగిన ప్రతీకార దాడుల్లో వాయు, క్షిపణి, డ్రోన్లు, లాంగ్ రేంజ్ ఆర్టిల్లరీలతో ఇరు దేశాలూ ఒకదానికొకటి బలమైన సందేశం ఇచ్చాయి. అయినప్పటికీ, ఈ ఘర్షణ ఎప్పుడూ అణు యుద్ధ స్థాయికి చేరలేదని, ఇరుపక్షాలు తగిన మితిని పాటించాయని జనరల్ చౌహాన్ పేర్కొన్నారు.

“ఇటువంటి పరిస్థితుల్లో పరిక్షణ పొందిన సైనికులు అత్యంత తర్కబద్ధంగా వ్యవహరిస్తారు. మేం చేసే ప్రతి చర్యకు వ్యాపక ప్రభావాలపై అవగాహన ఉంది,” అని ఆయన వివరించారు.

ఇటీవల పాక్ చీఫ్ ఆఫ్ జాయింట్ స్టాఫ్ జనరల్ సాహిర్ షంశాద్ మిర్జా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే భవిష్యత్‌లో వ్యూహపరమైన తప్పుదోవలు తలెత్తే అవకాశం ఉందన్న సూచన కూడా చేశారు.

భారత్ మొదటగా ఉగ్రవాద శిబిరాలపైనే దాడులు చేసినప్పటికీ, పాక్ దానికి మించి స్పందించిందని సీడీఎస్ తెలిపారు. దీంతో భారత వైమానిక దళం సుఖోయ్-30 ఎంఎంకేఐ, మిరాజ్-2000, రాఫెల్‌ల సహాయంతో పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు తదితరాలపై బ్రహ్మోస్, స్కాల్ప్, క్రిస్టల్ మేజ్-2 మిస్సైళ్లతో ఖచ్చితమైన ప్రతీకార దాడులు చేసింది.

CDS చౌహాన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యస్థిక పాత్రపైన మాత్రం స్పందించలేదు. “అణు యుద్ధానికి దగ్గరగా వచ్చాం అనే వ్యాఖ్యలు అసాధ్యమైనవి,” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *