March 24, 2026

సర్దార్ మృతి వెనుక కాంగ్రెస్ వేధింపులే?

  • అవినీతి, వేధింపులు.. సర్దార్‌ జీవితాన్ని బలిగొన్నాయా?
  • అభివృద్ధిని అడ్డుకుంటున్న పాలనా వైఫల్యాలు

హైదరాబాద్, మే 31: పేదలకు సంబంధించిన ఒక చిన్న ఇంటి నిర్మాణం… కానీ దాని వెనుక దాగి ఉన్న రాజకీయ దుర్మార్గాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. బోరబండకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు సర్దార్ అనుమానాస్పదంగా మృతి చెందడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ మరణం వెనుక కాంగ్రెస్ నాయకుల వేధింపులే కారణమని అభిప్రాయపడుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు, పాలక వ్యవస్థ అవినీతిపై తీవ్రంగా మండిపడుతున్నారు.

వివరాల్లోకి వెళితే…
శుక్రవారం తమ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, సర్దార్ ఒక పేద మైనారిటీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా 50 గజాల్లో ఇళ్లు కట్టుకుంటున్న సమయంలో కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లను తట్టుకోలేక ప్రాణాలు విడిచినట్లు ఆరోపించారు.

అంతేకాకుండా, అదే సమయంలో పక్క నియోజకవర్గమైన అయ్యప్ప సొసైటీలో అనుమతులేమీ లేకుండానే 6 నుండి 8 అంతస్తుల భవనాలు నిర్మాణంలో ఉన్నప్పటికీ, మున్సిపల్ అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.

అక్రమ కట్టడాలపై వివక్షా దృష్టి?
ఒక పేద వ్యక్తి 50 గజాల్లో ఒక అంతస్తు వేస్తే అక్రమమని కూల్చేస్తున్నారు. అదే సమయంలో పెద్ద నిర్మాణాలు మాత్రం పట్టించుకోవడం లేదంటే ఇది పరిపాలనా విఫలత కాదా? అంటూ మాధవరం ప్రశ్నించారు.

సర్దార్ మృతికి బాధ్యులైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించే ప్రజావాణి ప్రజల కోసమే కాదు, వసూళ్ల కోసమని మాధవరం విమర్శించారు. మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ నాయకులకు సహకరిస్తున్నారని కూడా ఆరోపించారు.

అభివృద్ధికి అడ్డుగా కాంగ్రెస్ పాలన
గత 18 నెలలుగా నగరానికి అభివృద్ధి కనిపించలేదని, ఫతేనగర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి నిరాహార దీక్ష చేపడతామని మాధవరం హెచ్చరించారు.

బీఆర్‌ఎస్ పాలనలో రూ.60 కోట్లు కేటాయించి, రైల్వే అనుమతులు కూడా పొందినప్పటికీ ఇప్పటి వరకూ పనులు జరగకపోవడం బాధాకరమని తెలిపారు. అలాగే, అల్లాపూర్ నుంచి దీన్‌దయాళ్‌నగర్ వరకు నాలా విస్తరణకు నిధులు మంజూరైనప్పటికీ కార్యాచరణలో తడవుగా ఉందని మండిపడ్డారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *