బీఆర్ నాయుడిపై భూమన సంచలన ఆరోపణలు
బీఆర్ నాయుడిపై భూమన సంచలన ఆరోపణలు
టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై విరుచుకుపడ్డారు. ఆదివారం తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ నాయుడి వ్యక్తిగత ప్రవర్తన మరియు పవిత్రమైన తిరుమల ప్రతిష్టకు జరుగుతున్న నష్టంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అనైతిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చైర్మన్ పదవిలో ఉండటం హైందవ సమాజానికి అవమానకరమని ఆయన పేర్కొన్నారు.
వైరల్ వీడియోలపై నిప్పులు.. “అది డీప్ ఫేక్ కాదు”
సోషల్ మీడియాలో బీఆర్ నాయుడికి సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలపై భూమన స్పందిస్తూ.. అవి ‘డీప్ ఫేక్’ కాదని, వాస్తవమైన వీడియోలేనని ఆరోపించారు. “బీఆర్ నాయుడు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. గతంలో కేవలం ఆడియో క్లిప్ బయటకు వచ్చినందుకే నటుడు పృథ్వీని పదవి నుంచి తొలగించాం. ఇప్పుడు వీడియోలు సాక్ష్యంగా ఉన్నా చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అని నిలదీశారు.
బ్రాహ్మణ మహిళ లేఖపై ఆరోపణలు
2019లో ఇందులేఖ అనే బ్రాహ్మణ మహిళ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖను భూమన ఈ సందర్భంగా బయటపెట్టారు. బీఆర్ నాయుడు ఒక “ఉమెనైజర్” అని, ఆయన ప్రవర్తన వల్ల ఎందరో మహిళలు ఇబ్బందులు పడ్డారని ఆ లేఖలో పేర్కొన్నట్లు భూమన చదివి వినిపించారు. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న మహిళ ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా, అలాంటి వ్యక్తిని పవిత్రమైన టీటీడీ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టడం వెనుక చంద్రబాబు ఉద్దేశపూర్వక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
రాజీనామా చేయాలని డిమాండ్
బీఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని భూమన డిమాండ్ చేశారు. “నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు.. అలాంటి నువ్వు మాపై ‘అరేయ్.. తురేయ్’ అని మాట్లాడటం నీ అజ్ఞానానికి నిదర్శనం. నీలాంటి లఫంగుల గురించి ఆలోచించే అవసరం మాకు లేదు” అంటూ ఘాటుగా విమర్శించారు. దేవుడి సన్నిధిలో అపవిత్ర పనులకు పాల్పడే వారికి భగవంతుడే శిక్ష వేస్తారని ఆయన హెచ్చరించారు.
#BhumanaKarunakarReddy #BRNaidu #TTD #Tirupati #AndhraPolitics #YSRCP #TDP #BreakingNews #Tirumala

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
