పరకామణి కేసుపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తిరుమల పరకామణి చోరీ కేసు మరియు లడ్డూ నెయ్యి కల్తీ అంశాలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ, వైఎస్ఆర్సిపి నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం తిరుపతిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
పరకామణి కేసులో మళ్ళీ కుట్ర – ఎఫ్ఐఆర్ రీ-ఓపెన్!
తిరుమల పరకామణి కేసులో వైఎస్ఆర్సిపి నేతలను ఇరికించేందుకు ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తోందని భూమన ఆరోపించారు. ఇప్పటికే విచారణ పూర్తయి, కోర్టుకు నివేదిక సమర్పించిన పరకామణి కేసులో మళ్లీ ఎఫ్ఐఆర్ వేయాలని సీఎం నిర్ణయించారన్నారు. ఈ కేసులో వైసిపి నేతలను నిందితులుగా చేర్చేలా నివేదిక తయారు చేయడానికి ఒక డీఎస్పీకి బాధ్యతలు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల్లోనే టీటీడీతో మళ్లీ ఫిర్యాదు చేయించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని తనకు సమాచారం ఉందని తెలిపారు.
సుప్రీం ఆదేశాల ధిక్కరణ
లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో చంద్రబాబు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారని భూమన విమర్శించారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ (SIT) విచారణపై నమ్మకం లేక, చంద్రబాబు ఏకసభ్య కమిషన్ వేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపడుతుందని, చంద్రబాబుకు మొట్టికాయలు వేయడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు.
అపచారాలు చేసేది చంద్రబాబే
శాసనమండలిలో దేవుడి పటాలు తీసుకెళ్లడంపై జరుగుతున్న రాద్ధాంతాన్ని భూమన తప్పుబట్టారు. “చంద్రబాబు బూట్లు వేసుకుని శ్రీవారి విగ్రహాలను బహుమతులుగా ఇచ్చారు. అప్పుడు అది అపచారం కాదా?” అని ప్రశ్నించారు. అలిపిరిలో బాంబు దాడి జరిగినప్పుడు శ్రీవారే వచ్చి కాపాడారని చెప్పుకునే చంద్రబాబు, తాను చేసిన పాపాల వల్లే క్లేమోర్ మైన్స్ పేలాయని ఎందుకు అనుకోరని నిలదీశారు.
కల్తీ నెయ్యి మూలాలు హెరిటేజ్ దగ్గరే!
కల్తీ నెయ్యి వ్యవహారంలో నిజాన్ని దాచిపెట్టేందుకు చంద్రబాబు ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని భూమన ధ్వజమెత్తారు. కల్తీ నెయ్యి మూలాలు చంద్రబాబు సొంత సంస్థ అయిన హెరిటేజ్ మరియు ఇందాపూర్ డెయిరీల దగ్గరే ఉన్నాయని ఆరోపించారు. ఈ వాస్తవాలను త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. దేవుడు, న్యాయస్థానాలు చంద్రబాబుకు బుద్ధి చెబుతాయని భూమన పేర్కొన్నారు.
#BhumanaKarunakarReddy #TTD #Tirumala #ChandrababuNaidu #YSRCP #AndhraPradeshPolitics #TirupatiNews #SupremeCourt

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
