రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అచ్చెన్నాయుడు
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అచ్చెన్నాయుడు
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇన్‌పుట్ సబ్సిడీని హెక్టారుకు రూ.25,000లకు పెంచి రైతులకు అండగా నిలిచామని ఆయన తెలిపారు. గురువారం శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, విపత్తుల సమయంలో సర్వేలు పూర్తి చేసి రికార్డు స్థాయిలో నష్టపరిహారం పంపిణీ చేసినట్లు వివరించారు. ముఖ్యంగా బుడమేరు వరదలు, తుఫాన్ల బాధితులకు త్వరితగతిన సాయం అందించామని పేర్కొన్నారు.
ఇన్‌పుట్ సబ్సిడీ పెంపు.. కౌలు రైతులకు సైతం లబ్ధి
గత ప్రభుత్వాల హయాంలో ఇన్‌పుట్ సబ్సిడీ తక్కువగా ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల కష్టాలను గుర్తించి ఆ మొత్తాన్ని భారీగా పెంచిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బుడమేరు వరదల సమయంలో నష్టపోయిన రైతులకు వారం రోజుల్లోనే సర్వే పూర్తి చేసి రూ.370 కోట్ల పరిహారం అందించామన్నారు. చరిత్రలో మొదటిసారిగా సొంత భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన గర్వంగా ప్రకటించారు.
పంటల భీమాపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం
గత వైసీపీ ప్రభుత్వం పంటల భీమా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి విమర్శించారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజనకు నిధులు చెల్లించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే సబ్ కమిటీని ఏర్పాటు చేసి, కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ మళ్లీ పంటల భీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. బకాయిలు చెల్లించి రైతులకు భరోసా కల్పించామని మంత్రి స్పష్టం చేశారు.
అరకు కాఫీ రక్షణకు ప్రత్యేక చర్యలు
అరకు కాఫీ తోటలను వేధిస్తున్న ‘కాఫీ బెర్రీ బోరర్’ వ్యాధిపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందని మంత్రి తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో వ్యాధి సోకిన కాయలను శాస్త్రీయంగా తొలగించి, నష్టపోయిన 81 మంది రైతులకు రూ.7.23 లక్షల ఇన్‌పుట్ సబ్సిడీని మంజూరు చేశామన్నారు. అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్‌కు ఎలాంటి భంగం కలగకుండా శాస్త్రవేత్తలు, అధికారుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు.
#APAgriculture #Atchennaidu #FarmersFirst #InputSubsidy #ArakuCoffee #CropInsurance #AndhraPradesh #TDP #BreakingNews

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
