March 26, 2026

AP CAPITAL:అమరావతికి ఇక శాశ్వత రాజముద్ర

AP CABINET

AP CABINET

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా ఏపీ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్-5ను సవరించి, అమరావతిని అధికారిక రాజధానిగా చేర్చాలని కోరుతూ మంత్రివర్గం తీర్మానం ఆమోదించింది. ఈ నెల 28న అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ అనంతరం ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్రం దీనిపై ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో రాజధాని అంశంపై లోతైన చర్చ జరిగింది. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో చేసిన ప్రయోగాలు, నాటి పరిణామాలను ప్రజలకు వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 28న శనివారం అసెంబ్లీలో నాలుగు గంటల పాటు అమరావతిపై చర్చ నిర్వహించి, రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతి పేరును ఖరారు చేస్తూ తీర్మానం చేయనున్నారు. ఏప్రిల్ 4లోపు పార్లమెంట్‌లో దీనికి రాజముద్ర పడనుంది.

కేబినెట్ భేటీలో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏప్రిల్ 5 (జగజ్జీవన్ రామ్ జయంతి) నుండి ఏప్రిల్ 14 (అంబేద్కర్ జయంతి) లోపు ప్రతి నియోజకవర్గంలో 2 వేల ‘సూర్యఘర్’ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించాలని, సబ్ స్టేషన్ల వద్ద బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక సంస్కరణలతో విద్యుత్ శాఖను బలోపేతం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇళ్లకే నేరుగా వంట గ్యాస్ సరఫరా చేసే పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల వినియోగదారులకు సులభంగా, సురక్షితంగా గ్యాస్ అందనుంది. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు అభివృద్ధి పనులపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అమరావతికి కేంద్రం నుంచి చట్టబద్ధత రావడం ద్వారా రాజధాని నిర్మాణ పనులు మరింత వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Amaravati #APCabinet #AndhraPradesh #ChandrababuNaidu #APPolitics #CapitalCity #BreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *