March 23, 2026

ఆదిలాబాద్‌పై పిడుగుల వర్షం: ఎనిమిది మంది మృతి

తెలంగాణలోని ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో భారీ వర్షంతో కూడిన పిడుగుల భీభత్సం (Lightning strikes) సృష్టించింది. గురువారం మధ్యాహ్నం సంభవించిన ఈ ఘటనలో ఎనిమిది మంది వ్యవసాయ కూలీలు (Agricultural laborers) పిడుగుపాటుకు గురై దుర్మరణం పాలయ్యారు. పది మందికి పైగా గాయపడగా, ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది.

ఆదిలాబాద్, జూన్ 12: ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల వర్షం (Lightning strikes) ఎనిమిది మందిని పొట్టన పెట్టుకుంది. మరో పది మందిని ఆస్పత్రి పాలు చేసింది. గురువారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పిడుగులు తోడవడంతో పిడుగు పాటుకు గురై ఎనిమిది మంది మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండలం పిప్రి గ్రామంలో చేనులో పత్తి విత్తనాలు విత్తుతుండగా వ్యవసాయ కూలీలపై (Agricultural laborers) పిడుగు పడటంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. చేనులో ఉన్న మరో ఎనిమిది మందికి పిడుగుపాటు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఉట్నూర్, బేల మండలాల్లోను పిడుగుల వర్షం భీభత్సం సృష్టించింది.

బేల మండలంలోని సాంగ్డి గ్రామంలో గెడం నందిని, సొన్ కాస్ గ్రామంలో కోవ సునీత అనే మహిళా కూలీలు పిడుగుపాటుకు గురై మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని పిప్పిరి గ్రామంలోనూ వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉన్న వ్యవసాయ కూలీలను పిడుగుల వర్షం బలి తీసుకుంది. పిప్పిరి గ్రామానికి చెందిన మంగం భీంబాయి, సిడం రాంబాయి, పెందూర్ మనోహర్, పెందుర్ సంజన అనే మహిళా వ్యవసాయ కూలీలు నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ప్రమాదంలో మరో 8 మంది పిడుగుపాటుకు గురై తీవ్రంగా గాయపడ్డారు‌. క్షతగాత్రులను (Injured) ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ఏరువాక పౌర్ణమి మరుసటి రోజే ఈ ప్రమాదం జరగడంతో ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది. మృతులందరూ వ్యవసాయ కూలీలే కావడం.. పొలం పనుల్లో నిమగ్నమై పత్తి విత్తనాలు వేస్తుండగా పిడుగుపాటుకు గురవడం జిల్లాలో విషాదాన్ని నింపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *