భక్తులకు నిరంతర అన్నప్రసాద సేవలు
తిరుమల, 25 మే 2025:
తపస్సులు, భక్తి భావాల మధ్య పవిత్రతకు ప్రతీకగా నిలిచే తిరుమల ఇప్పుడు భక్తజనసంద్రంగా మారింది. వేసవి సెలవులు, శనివారం కలసి భక్తుల రాకపోకలతో తిరుమల కిటికీట్లాడుతుంది. అంతులేని భక్తభావంతో తరలివచ్చే వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, వైద్యం, శుభ్రత, దర్శన ఏర్పాట్లలో తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
గత వారం రోజులుగా తిరుమలలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, ఎన్‌జి షెడ్లు, వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎడతెరిపిలేని అన్నప్రసాదాలు, తాగునీటి సరఫరా జరుగుతోంది. విశేషంగా మే 17 తరువాత ప్రతి రోజు సగటున 2.5 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు, 90 వేల మందికి ఉపాహార పదార్థాలు, పానీయాలు సరఫరా అవుతున్నాయి.
మే 24న ఒక్కరోజే ఎంటీవీఏసీలో 93,950 మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించగా, వెలుపల క్యూలైన్లు, వైకుంఠంలో కలిపి 2.72 లక్షల మందికి సర్వింగ్లు పూర్తయ్యాయి. అలాగే 1.17 లక్షల మందికి పానీయాలు పంపిణీ చేశారు.
తిరుమల ఆరోగ్య విభాగం ద్వారా శుద్ధమైన తాగునీరు సరఫరా చేయడమే కాకుండా, శానిటేషన్ సిబ్బంది 2,150 మంది వివిధ విభాగాల్లో శ్రమిస్తున్నారు. క్యూలైన్లు, ఆలయం పరిసరాల్లో శుభ్రత కల్పిస్తున్నారు. వైద్య సేవలు, కల్యాణకట్ట, రేడియో ప్రసార విభాగాలు కూడా నిరంతర సేవలతో ముందున్నారు.
శ్రీవారి సేవకుల సేవలు ప్రత్యేకంగా ప్రశంసనీయంగా మారాయి. దాదాపు 3 వేల మంది సేవకులు అన్నప్రసాద కేంద్రాలు, వైకుంఠం, నారికేళకాయ కౌంటర్లు, లడ్డూ కౌంటర్లు, ఆలయం వంటి ప్రదేశాల్లో శ్రద్ధతో సేవలు అందిస్తున్నారు. వీరిలో 800 మంది ప్రత్యేకంగా అన్నప్రసాదం, పాలు, నీరు అందించే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
TTD విజిలెన్స్, ఆలయ విభాగం సమన్వయంతో క్యూలైన్లు సజావుగా నడిపించబడుతూ, భక్తులకు రికార్డు స్థాయిలో దర్శనం కలిగిస్తున్నారు. మే 24 శనివారం ఒక్క రోజే 90,211 మంది శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం పొందారు. గత మూడురోజుల్లో మొత్తం 2.4 లక్షల మంది స్వామివారి సన్నిధిని చేరారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.