ఎన్నికల వరకు తగ్గింపులు… తర్వాత పెంపులు — ఇదే మళ్లీ పునరావృతమవుతుందా?
మధ్యప్రాచ్యం మండిపోతోంది. ప్రపంచం మొత్తం ఇంధన సంక్షోభంలో కూరుకుపోయింది. కానీ భారత్‌లో మాత్రం ధరలు తగ్గుతున్నాయి. ఇదేం ఆర్థిక సూత్రం? ముఖ్యంగా అతి పెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి ఇది చిన్న విషయం కాదు. అత్యధిక జనాభా కిటకిటలాడుతున్న భారత దేశంలో పెట్రో ఉత్పత్తుల అవసరాలు అంతే స్థాయిలో ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు పెరుగుతుంటే భారతదేశంలో మాత్రం అందుకు విరుద్ధంగా తగ్గుతున్నాయి. ఇది మార్కెట్ నిర్ణయమా? లేక రాజకీయ నిర్ణయమా? ఇదే అసలు సందేహం.
ఏకంగా సుంకాలను తగ్గించి, మరికొన్నింటిని తొలగించి భారీగా ఊరట కలిగించారు. ఇది నిజంగా ప్రజల పట్ల ఉన్న ప్రేమా? గతంలో ఎన్నడూ ఇలాంటి ప్రేమ కనిపించలేదే?
తాత్కాలిక ఉపశమనం తర్వాత ఒక్కసారిగా పెంపులు రావడం గతంలో చూసిందే. అందుకే ఈ తగ్గింపుల వెనుక అసలు కారణం ఏమిటన్న చర్చ మొదలైంది.
ఇది చిన్న మార్కెట్ కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగ దేశాల్లో భారత్ ఒకటి. దాదాపు 147 కోట్ల జనాభా ఉన్న భారత దేశానికి పెట్రో, గ్యాస్ ఉత్పత్తుల వినియోగం ఎంత ఉంటుందో తెలుసా?
రోజుకు పెట్రోల్ + డీజిల్ 45 కోట్ల లీటర్లు, LPG 10 కోట్ల కేజీలు అవసరం ఉంటుంది. అలాగే నెలకు లెక్కిస్తే పెట్రోల్ 435 – 450 కోట్ల లీటర్లు, డీజిల్ 870 – 900 కోట్ల లీటర్లు, LPG గ్యాస్ 280 – 300 కోట్ల కేజీలు వినియోగం ఉంటుంది.
భారత్‌లో ఇంధన డిమాండ్ (రోజుకు & నెలకు)
| ఇంధనం | రోజుకు డిమాండ్ | నెలకు డిమాండ్ |
|---|---|---|
| పెట్రోల్ | 14.5 – 15 కోట్ల లీటర్లు | 435 – 450 కోట్ల లీటర్లు |
| డీజిల్ | 29 – 30 కోట్ల లీటర్లు | 870 – 900 కోట్ల లీటర్లు |
| LPG గ్యాస్ | 9.3 – 10 కోట్ల కేజీలు | 280 – 300 కోట్ల కేజీలు |
ఇక భారత దేశానికి క్రూడ్ ఆయిల్ అవసరం ఎంతో తెలుసా? భారత్ రోజుకు అవసరం 82 కోట్ల లీటర్లు. ఇందులో దేశీయ ఉత్పత్తి 11 కోట్ల లీటర్లు, దిగుమతి 71 కోట్ల లీటర్లు అంటే 85% విదేశాలపై ఆధారపడుతోంది.
భారత్‌లో క్రూడ్ ఆయిల్ – రోజుకు దిగుమతి vs దేశీయ ఉత్పత్తి
| అంశం | రోజుకు (బ్యారెల్స్) | రోజుకు (లీటర్లు సుమారు) | శాతం |
|---|---|---|---|
| దేశీయ ఉత్పత్తి | ~0.7 మిలియన్ బ్యారెల్స్ | ~11 కోట్ల లీటర్లు | 15% |
| దిగుమతి | ~4.5 మిలియన్ బ్యారెల్స్ | ~71 కోట్ల లీటర్లు | 85% |
| మొత్తం అవసరం | ~5.2 మిలియన్ బ్యారెల్స్ | ~82 కోట్ల లీటర్లు | 100% |
మధ్యప్రాచ్యంలో యుద్ధం, సరఫరా అంతరాయం, గ్యాస్ కొరత—all these should logically push prices up. కానీ ధరలు పెరగడం లేదు. ఇంత భారీ దిగుమతి భారాన్ని ప్రభుత్వం భరిస్తుందా? లేక ఎన్నికల వరకు మాత్రమే భరిస్తుందా?
Read this article also: Jagan, Sharmila dispute -Viveka murder case : ప్రజలకు ఉపయోగమేంటి?
రష్యా నుంచి అదనంగా కొనుగోలు చేస్తున్నామే తప్ప, ఇరాన్ నుంచి దాదాపు క్రూడ్ నిలిచిపోయింది. రెండో మూడో షిప్పులు వస్తే దానిని చాలా గొప్పగా చెబుతున్నారు, కానీ రావాల్సింది ఎంతో ఆగిపోయింది. అయినా ధరలు పెరగడం లేదు.
ధరలు పెరగాలి అనేది నా ఉద్దేశ్యం కాదు. ధరలు మార్కెట్ ఆధారంగా కాకుండా ఎన్నికల క్యాలెండర్ ఆధారంగా కదులుతున్నాయనే విమర్శలు ఇక్కడ మొదలవుతున్నాయి. రాబోయే కాలం మరింత భయంకరంగా ఉండబోతోందని చెప్పడమే ప్రధానం.
2017 రాష్ట్ర ఎన్నికల సమయం గుర్తుందా? ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఇంధన ధరల పెంపు పూర్తిగా నిలిపివేశారు.
ఈ ఎన్నికలు బీజేపీకి కీలకం కనుక ప్రజా వ్యతిరేకత రాకుండా నిలపేశారు. పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ, ఎన్నికలు ముగిసిన వెంటనే పెంపులు ప్రారంభమయ్యాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే పెంపులు రావడం యాదృచ్ఛికమా? అనే ప్రశ్న అప్పుడే లేవింది.
ఇక 2018 కర్ణాటక ఎన్నికలప్పుడు 19 రోజులు ధరలు పెంచలేదు. ఇక్కడ కూడా బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలబడింది.
కానీ, ఓటింగ్ ముగిసిన తర్వాత వరుసగా 16 రోజులు పెట్రో ఉత్పత్తుల ధర పెంచారు. మొత్తం మీద పెట్రోల్ దాదాపు ₹3కు పైగా, డీజల్ ₹3కి వరకూ పెరిగింది. అంటే పెరిగిన ధరలను రోజువారీగా వాయిదాల పద్దతిలో జనం నుంచి ముక్కు పిండి వసూలు చేశారు. రోజువారీ చిన్న పెంపుల ద్వారా భారాన్ని మెల్లగా వినియోగదారుడిపై మోపారు.
ఇక ప్రధాన ఎన్నికలు 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఇదే పద్దతిని పాటించారు. చివరి దశ పోలింగ్ వరకు ధరలు స్థిరంగా ఉంచారు.
పోలింగ్ ముగిసిన వెంటనే పెట్రోల్ బాదేశారు. పెట్రోల్ సుమారు 80 పైసలు, డీజల్ 70 పైసలు వరుసగా పెంచేశారు. ఇక్కడ కూడా భారం చివరికి వినియోగదారుడిపైనే పడింది.
ఉత్తర ప్రదేశ్ బీజేపీకి చాలా కీలకం అన్న విషయం అందరికీ తెలుసు. అందుకే, 2021 నవంబర్ నుంచి 2022 రాష్ట్ర ఎన్నికల వరకు దాదాపు 130 రోజులు పెట్రోల్ డీజల్ ధరలు పెంచలేదు.
ఉత్తరప్రదేశ్ వంటి కీలక ఎన్నికలు పూర్తయ్యాక ఒక్కసారిగా పెంపులు ప్రారంభమయ్యాయి. పెట్రోల్, డీజల్ రోజుకు 80 పైసల చొప్పున పెరిగాయి. ఆ తరువాత రోజుల వ్యవధిలోనే ₹8-₹10 వరకు పెంచేశారు. అదనంగా LPG సిలిండర్ కూడా ₹50 పెరిగింది. ఇక్కడ కూడా అంతే. భారం చివరికి వినియోగదారుడిపైనే పడింది.
ఇంధన ధరలు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు కూడా. 2020 కరోనా సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయాయి.
సాధారణంగా అయితే దేశంలో పెట్రోల్-డీజల్ ధరలు తగ్గాలి. కానీ తగ్గలేదు. కేంద్రం పెట్రోల్‌పై ₹13, డీజల్‌పై ₹16 వరకు ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. 2020 కరోనా సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు పడిపోయాయి. కానీ దేశంలో ధరలు తగ్గలేదు. పన్నులు పెంచి ఆదాయం పెంచుకున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల ముందు పెట్రోల్, డీజల్ ధరల పెంపుపై దుమారం చెలరేగింది. దీంతో పెట్రోల్, డీజల్ ధరలు ₹2 తగ్గించారు.
రెండు సంవత్సరాల పాటు మార్పులు లేకుండా ఉంచిన తర్వాత ఒక్కసారిగా తగ్గింపు ఇచ్చారు. తరువాత షరా మామూలే. పెంచుకుంటూ వచ్చారు. ఇది కొత్త ధోరణి కాదు. 2017 తర్వాత మాత్రమే కాదు. 2009 నుంచి కూడా ఇదే నమూనా కనిపిస్తోంది.
2009 లోక్‌సభ ఎన్నికల కాలంలో పెట్రోల్-డీజల్ ధరలు పెద్దగా పెంచలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత 2010లో భారీ పెంపులు వచ్చాయి. పెట్రోల్ ₹3.5, డీజల్ ₹2 పెంచారు. 2012లో పెట్రోల్ ధర ₹7.50 ఒక్కసారిగా పెంచేశారు.
మరి ఇప్పుడు ప్రపంచమంతా పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు పెరుగుతుంటే భారత దేశం తగ్గించేందేంటి? అదే మహత్యం. భారతీయ జనతాపార్టీకి కీలక రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పాండిచ్చెరిలలో ఎన్నికలు బీజేపీకి సవాల్ గా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీలు బీజేపీకి కొరకరాని కొయ్యలా తయారయ్యారు. కేరళలో పాగా వెయ్యాలి. అస్సాంలో తిరిగి అధికారం చేజిక్కించుకోవాలి. పాండిచ్చెరీలో పాలనలోకి రావాలి. ఇది బీజేపీ వ్యూహం.
కానీ, ఇరాన్ యుద్ధం అడ్డువస్తోంది. దాని కారణంగా ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడింది. పైకి బింకంగా మాటలు చెబుతున్నప్పటికీ పెట్రోల్, డీజల్ ఎప్పుడు పెరుగుతాయోననే భయం ఉంది.
ఇలాంటి సమయంలో ధరలు పెంచితే, ఎన్నికల కొంప కొల్లేరవుతుంది. అందుకే మోడీ ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. కంపెనీలకు తీరని నష్టం వస్తుందని వారు వాపోతున్నారు.
ఇలాంటి సమయంలో పెంచితే, నిత్యవసర, రవాణా ఖర్చులు పెరిగి ఎన్నికలపై ప్రభావం పడుతుంది. అందుకే ధర పెంచకుండా సుంకాలను తగ్గించి, పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడు ప్రశాంతత కనిపిస్తోంది. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత పెంపులు వస్తాయా? గత అనుభవం చూస్తే ఇదే భయం. ఇదే ఇప్పుడు వినిపిస్తున్న పెద్ద ప్రశ్న.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.
