
తెలుగు సంస్కృతి, భక్తి పరంపరలను విస్తృతంగా ప్రజల మదిలో నాటేందుకు తీరని కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పుడీ ధార్మిక ఉద్యమాన్ని మరింత ప్రజల మధ్యకి తీసుకెళ్లేందుకు, ప్రత్యేక ప్రణాళికలతో ముమ్మర కార్యక్రమాలు చేపట్టాలని టిటిడి ఈవో జె. శ్యామల రావు పిలుపునిచ్చారు. విశేషమైన ఆలోచనలు, కార్యాచరణలతో జరిగిన తాజా సమీక్షా సమావేశానికి సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
సనాతన ధర్మాన్ని విశాలంగా ప్రచారం చేయాలనే దృక్పథంతో తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్‌లో టిటిడి ఈవో జె. శ్యామల రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. హెచ్.డి.పి.పి, శ్రీనివాస కల్యాణం, అన్నమాచార్య, వేంకటేశ్వర రికార్డింగ్, పబ్లికేషన్, పురాణ ఇతిహాస, దాస సాహిత్య ప్రాజెక్ట్‌లతోపాటు ఎపిక్ స్టడీస్‌కు చెందిన అధికారులతో ఈ సమావేశం జరిగింది.
ఈవో మాట్లాడుతూ భగవద్గీత సారాంశాన్ని పిల్లలు, యువతకు అర్థమయ్యేలా సరళమైన భాషలో అందించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ముఖ్యమైన ఘట్టాలను కార్టూన్‌లు, వీడియోల రూపంలో రూపొందించాలి అన్నారు. హిందూ ధర్మ విశిష్టత, మానవీయత, నైతిక విలువలపై కార్యక్రమాలు రూపొందించి మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులలో భక్తి భావం, క్రమశిక్షణ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలపై అవగాహన పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలన్నారు.తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ద్వారా పచ్చదనాన్ని ప్రోత్సహించే విధంగా “శ్రీవారి వన నిధి” ద్వారా ఒక మొక్కను అందించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
అన్నమయ్య సంకీర్తనలకు ప్రత్యేక యూ ట్యూబ్ చానెల్
వేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ పనితీరుపై సమీక్ష నిర్వహించిన ఈవో, అన్నమయ్య సంకీర్తనలన్నిటినీ టిటిడి ప్రత్యేక యూ ట్యూబ్ చానెల్‌లో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇప్పటికే గుర్తించిన 14,932 సంకీర్తనల్లో ఎన్ని రికార్డ్ చేయబడ్డాయో, ఎన్ని మిగిలాయో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వినోదాత్మకంగా ఉండేలా కొత్త సంకీర్తనల ప్రాచుర్యానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు.
పుస్తక ప్రచురణలపై దృష్టి
టిటిడి పబ్లికేషన్ శాఖ పనితీరును సమీక్షించిన ఈవో, పిల్లలు, యువతకు అర్థమయ్యేలా కథనాలు ముద్రించాలన్నారు. టిటిడి ముద్రించిన అన్ని పుస్తకాలు బుక్ స్టాల్స్‌లో లభ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని పుస్తకాలు ముద్రించబడినాయి, ఎన్ని ఈబుక్స్‌గా అప్‌లోడ్ చేయబడినాయో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని సూచించారు.
అధికారుల సమన్వయం
ఈ సమీక్షా సమావేశంలో జేఈవో వీ. వీరబ్రహ్మం, డిపిపి సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్, ప్రత్యేక అధికారి రాజగోపాల్, అదనపు కార్యదర్శి రామ్ గోపాల్, అన్నమాచార్య ప్రాజెక్ట్ అధికారి మేడసాని మోహన్, డైరెక్టర్ శ్రీమతి లత, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి రామానందతీర్థాచార్యులు తదితరులు పాల్గొన్నారు.