- కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. తాను జైలులో ఉన్నప్పుడే ఈ కుట్ర మొదలైందని కవిత వెల్లడించారు. తనపై తప్పుడు వార్తలను వ్యాపింపజేయడానికి ‘పెయిడ్ ఆర్టిస్టుల’ను ఉపయోగిస్తున్నారని, ఇంటి ఆడబిడ్డపై ఇలాంటి ప్రచారాలు చేయిస్తారా అని ఆమె ప్రశ్నించారు. “నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీలోని “లీకువీరుల”పై కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పానని, కానీ “లీకువీరులను పట్టుకోమంటే, గ్రీకువీరులు దండెత్తారు” అంటూ చురకలంటించారు. తన జోలికి వస్తే బాగుండదని హెచ్చరించారు.
కొంతమంది వ్యక్తులు కేసీఆర్‌ను తామే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని, “కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు?” అంటూ కవిత ప్రశ్నించారు. తనపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదని, పార్టీ సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన లేఖను లీక్ చేసిందెవరో చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌కు నోటీసులు వచ్చినప్పుడు నిరసనలు తెలపని పార్టీ, ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేసిందని కవిత ప్రశ్నించారు. తాను వారిలా “చిచోరా రాజకీయాలు” చేయనని, హుందాగా ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ చేయాల్సిన పనులను తాను జాగృతి తరపున చేస్తున్నానని తెలిపారు. పార్టీలో “కోవర్టులు” ఉన్నప్పుడు వారిని ఎందుకు పక్కన పెట్టడం లేదని నిలదీశారు.
బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని కవిత పునరుద్ఘాటించారు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ “మునిగిపోయే నావ” అని అభివర్ణించిన కవిత, కాంగ్రెస్‌తో రాయబారాలు జరిపే అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు. తనకు, కేసీఆర్‌కు మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందని, తనను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసని కవిత అన్నారు. చివరగా, తనను కావాలనే ఎంపీ ఎన్నికల్లో ఓడించారని ఆమె ఆరోపించారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.