అన్నా క్యాంటీన్లలో భోజనం నాణ్యంగా ఉండాలి..
నగరంలోని అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించినా సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య స్పష్టం చేశారు. బుధవారం తిరుమల బైపాస్ రోడ్డులోని స్విమ్స్ కూడలి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజన సమయానికి చేరుకున్న కమిషనర్, అక్కడ అందుతున్న ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించడమే కాకుండా, భోజనం చేస్తున్న సామాన్య ప్రజలతో నేరుగా ముచ్చటించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
అన్నం వృధా చేయొద్దు.. క్రమశిక్షణ పాటించాలి
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని, పేదలకు అందే ఈ పవిత్రమైన భోజనాన్ని ఎవరూ వృధా చేయకూడదని సూచించారు. క్యాంటీన్‌కు వచ్చేవారు క్రమశిక్షణ పాటిస్తూ, ఒక్కొక్కరు ఒక్క టోకెన్ మాత్రమే తీసుకోవాలని కోరారు. ఆకలితో వచ్చే ప్రతి ఒక్కరికీ కడుపునిండా భోజనం అందేలా చూడటం మన బాధ్యతని, అందుకు ప్రజల సహకారం కూడా అవసరమని ఆమె పేర్కొన్నారు.
పరిశుభ్రతే ప్రాధాన్యం.. పిర్యాదులు రాకూడదు
క్యాంటీన్ నిర్వాహకులకు కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. భోజనం నాణ్యంగా ఉండటంతో పాటు, పరిసరాలు అత్యంత పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. వంట గది నుండి భోజనం వడ్డించే ప్రదేశం వరకు ఎక్కడా అపరిశుభ్రత కనిపించకూడదని తెలిపారు. భక్తులకు, స్థానికులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజల నుండి ఆహారం లేదా పరిశుభ్రతపై ఎటువంటి ఫిర్యాదులు అందకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
పేదలకు భరోసా.. పటిష్ట పర్యవేక్షణ
అన్నా క్యాంటీన్ల ద్వారా తక్కువ ధరకే పేదలకు పౌష్టికాహారం అందుతోందని, ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని కమిషనర్ మౌర్య తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించేందుకు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని ఆమె పునరుద్ఘాటించారు.
#AnnaCanteen #Tirupati #MunicipalCommissioner #QualityFood #AndhraPradesh #PublicService #HygieneFirst #TirupatiNews
