April 12, 2026

ఎట్టకేలకు సూపర్‌కింగ్స్: ఢిల్లీపై ఘనవిజయం

CHENNAI SUPER KINGS

CHENNAI SUPER KINGS

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. శనివారం తమ హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 23 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగి అజేయ సెంచరీ బాదడంతో చెన్నై ఈ సీజన్‌లో తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.

CSK: ధోనీ రీఎంట్రీ, బ్రేవిస్ రాక! ఈ వార్తను కూడా చదవండి

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఓపెనర్ సంజు శాంసన్ (115 నాటౌట్) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. మరోవైపు యువ బ్యాటర్ ఆయుష్ మాత్రె (59) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (15) త్వరగానే నిష్క్రమించినా, శాంసన్ – మాత్రె జోడీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఆఖర్లో శివం దూబే (20 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది.

213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్ నిశాంక (41), ట్రిస్టన్ స్టబ్స్ (60) పోరాడినా.. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. కెఎల్ రాహుల్ (18), డేవిడ్ మిల్లర్ (17) వంటి స్టార్ ప్లేయర్లు విఫలమవ్వడం ఢిల్లీ ఆశలను దెబ్బతీసింది. చెన్నై బౌలర్లలో జెమీ ఓవర్టన్ (4/18) నిప్పులు చెరిగే బంతులతో ఢిల్లీ నడ్డి విరిచాడు. అన్షుల్ కాంబోజ్ (3/35) అతనికి చక్కటి సహకారం అందించడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ఖాతా తెరిచి ఊపిరి పీల్చుకుంది. సంజు శాంసన్ ఫామ్‌లోకి రావడం, బౌలర్లు సమష్టిగా రాణించడం చెన్నై క్యాంప్‌లో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు వరుసగా రెండో ఓటమిని చవిచూసిన ఢిల్లీ క్యాపిటల్స్ తన తప్పులను సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విధ్వంసకర సెంచరీతో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

#CSK #SanjuSamson #IPL2026 #WhistlePodu #CSKvsDC #CricketNews #Dhoni #RuturajGaikwad #IPLHighlights

CSK: ధోనీ రీఎంట్రీ, బ్రేవిస్ రాక! ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *