తెలంగాణలో కార్మికుల న్యాయ హక్కులకు గళమెత్తింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య పాలనకు వ్యతిరేకంగా ఉద్యమ దారిని ఎంచుకున్నారు. ఉద్యమాల ద్వారా హక్కులు సాధించుకుందామని నేతలు సంకల్పించారు. వేదన, వంచనల నడుమ నలిగిన కార్మిక చేతులు… ఇప్పుడు బలంగా జెండాలు పట్టుకున్నాయి.
సమస్యలపై పోరాటమే మార్గం
కార్మిక మాసోత్సవాల సందర్భంగా వరంగల్ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనంలో, దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో వివిధ కార్మిక సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కార్మికుల హక్కులు కాలరాసే కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక కోడ్లను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులను వేధిస్తున్న మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వెంటనే అణగదీయాలని హెచ్చరించారు.
అంతేగాకుండా, గతంలో కేసీఆర్ – కేటీఆర్ పాలనలో వీధి వ్యాపారులకు కల్పించిన వెండింగ్ జోన్లు, రుణ సహాయాలను గుర్తు చేస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014లో తెచ్చిన చిన్న వ్యాపారుల రక్షణ చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక మంత్రిని నియమించకపోవడాన్ని, కార్మికుల పట్ల తేలికపాటి వైఖరిగా అభివర్ణించారు.
వాగ్దానాలు గాలికి.. ఉద్యమమే గమ్యం
బహుళ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు సామాజిక, ఆర్థిక భద్రతలు, ఇఎస్ఐ సదుపాయాలు కల్పించాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన భూమిలో కార్మిక భవనం నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికుల కోసం ఉన్న 2014 కటాఫ్‌ను తొలగించాల్సిందిగా, స్కీమ్ వర్కర్లకు ఎన్నికల హామీ ప్రకారం రూ.26,000 పింఛను ఇవ్వాలని కోరారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని వినయ్ భాస్కర్ స్పష్టంగా చెప్పారు. జూన్ 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మెలో ప్రతీ కార్మికుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల కోసం, ప్రభుత్వాల తీరుపై ఉద్యమాలతోనే పోరాడాలన్నారు. కార్యక్రమానికి కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.