వెనిజులాలో కొత్త శకం: చమురు రంగంలో ప్రైవేటీకరణకు పచ్చజెండా
దశాబ్దాలుగా ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్న చమురు రంగాన్ని విదేశీ మరియు ప్రైవేటు పెట్టుబడుల కోసం తెరుస్తూ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ గురువారం (జనవరి 29, 2026) చారిత్రాత్మక చట్టంపై సంతకం చేశారు.
జనవరి 3న అమెరికా దళాలు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకుని న్యూయార్క్‌కు తరలించిన తర్వాత, ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. పార్లమెంటులో ఈ కొత్త చమురు చట్టం ఆమోదం పొందిన కేవలం రెండు గంటల్లోనే ఆమె దీనిపై సంతకం చేయడం విశేషం. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన PDVSA కి ఉన్న ఏకఛత్రాధిపత్యానికి ఈ చట్టం తెరదించింది. ఇప్పుడు ప్రైవేటు కంపెనీలు చమురు వెలికితీత, ఉత్పత్తి మరియు విక్రయాలలో పూర్తి నిర్వహణ బాధ్యతలను చేపట్టవచ్చు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రాయల్టీలను (Tax) 30 శాతం వరకు తగ్గించే అధికారాన్ని ప్రభుత్వం ఈ చట్టం ద్వారా పొందింది.
అధ్యక్షురాలు డెల్సీ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు, పతనావస్థలో ఉన్న చమురు మౌలిక సదుపాయాలను బాగు చేసేందుకు ఈ నిర్ణయం తప్పనిసరని పేర్కొన్నారు. “మనం మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి” అని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఈ చట్టం ఆమోదం పొందిన వెంటనే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాపై ఉన్న కొన్ని చమురు ఆంక్షలను సడలించారు. అమెరికాకు చెందిన చమురు దిగ్గజ సంస్థలు ఇప్పటికే వెనిజులాలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.
#Venezuela #DelcyRodriguez #OilSector #GlobalPolitics #Maduro #TrumpAdministration #BreakingNews
