నైజీరియాపై అమెరికా భీకర దాడులు.. ఐసిస్ లక్ష్యంగా వైమానిక దాడులు: ట్రంప్
నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా భీకర దాడులకు దిగింది. నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న హింసకు ప్రతిగా ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా ఆయన పోస్టు చేశారు.
“నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా శక్తిమంతమైన దాడులు ప్రారంభించింది. అమాయకులైన క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దారుణ హత్యలకు పాల్పడుతున్న వారిపైనే ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ ఊచకోతలు ఆపకపోతే నరకం చూపిస్తానని గతంలోనే హెచ్చరించాను. నా హెచ్చరికలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఫలితాలు అనుభవిస్తున్నారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సహించను” అని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మృతి చెందిన ఉగ్రవాదులతో సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. క్రైస్తవులపై హింస కొనసాగితే అమెరికా దాడులు కూడా కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకే ఈ దాడులు చేపట్టామని, పలువురు ఉగ్రవాదులను అంతం చేశామని అమెరికా సైనిక అధికారి ఒకరు తెలిపారు.
నైజీరియా ప్రస్తుతం ఐసిస్ అనుబంధ సంస్థలు, బోకో హరామ్ తీవ్రవాదుల ముప్పును ఎదుర్కొంటోంది. 2020లో అమెరికా నైజీరియాను ప్రత్యేక ఆందోళనకర దేశాల జాబితాలో చేర్చింది. క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు (Christian Persecution in Nigeria) నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళిక రూపొందించాలని పెంటగాన్‌ను ట్రంప్ గతంలోనే ఆదేశించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా దాడులు చోటుచేసుకున్నాయి. నైజీరియాలోని ఈశాన్య మైదుగురి ప్రాంతంలో ఉన్న ఓ మసీదు వద్ద జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు. రాత్రి ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో దేశంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
#Nigeria
#USAirStrikes
#ISIS
#DonaldTrump
#GlobalTerrorism