స్థానిక, అనుబంధ ఆలయాలలో ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ ఏర్పాటు
ప్రణాళికబద్ధంగా ఆలయాల నిర్వహణపై ఎస్ఓపీ విధానం
టిటిడి ఆలయాల నిర్వహణపై టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష
టిటిడి స్థానిక, అనుబంధ ఆలయాల నిర్వహణ, బడ్జెట్, ఎస్వోపీ, అభివృద్ధి పనులపై టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో మంగళవారం అధికారులతో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టిటిడి అనుబంధ, స్థానిక ఆలయాల వార్షిక హుండీ ఆదాయం, ఖర్చులు ఎంత వస్తోంది, ఏ ఏ ఆలయాలకు బడ్జెట్ కు లోబడి ఖర్చులు అవుతున్నాయి, ఏఏ ఆలయాలలో ఆదాయానికి మించి ఖర్చులు అవుతున్నాయనే అంశాలపై అధికారులతో చర్చించారు. ఇకపై ప్రతి ఆలయ నిర్వహణ కోసం ఒక కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయాల రోజువారి నిర్వహణ, మరమ్మతులు తదితర సాధారణ ఖర్చులను కార్పస్ ఫండ్ కు వచ్చే వడ్డీ సొమ్ముతో ఖర్చు చేయాలని సూచించారు. పెద్ద స్థాయిలో మరమ్మతులు, వార్షిక ఉత్సవాల కోసం కేపిటల్ ఖర్చుగా భావించి టిటిడి నిధులతో ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా, ప్రతి ఆలయానికి జనరల్ అకౌంట్, అన్నదానం కోసం మరో అకౌంట్ తెరిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, సిసిటివీలు, సెక్యూరిటీ, రవాణా, ట్రాఫిక్ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. వచ్చే వేసవి నేపథ్యంలో టిటిడి ఆలయాలలో భక్తులకు వైద్యసేవలు, తాగునీరు, వ్యర్థాల నిర్వాహణ, మరుగుదొడ్లు తదితర అంశాలపై ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. టిటిడిలోని ఆలయాలలో ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు, కార్యక్రమాల నిర్వహణపై ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని(ఎస్ఓపీ) రూపొందించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఆలయానికి విరాళాలు ఇచ్చేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, ఎప్ఏఅండ్ సీఏవో ఓ. బాలాజీ, సీఈ టి.వి. సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.
#TTD #AnilKumarSinghal #TempleManagement #CorpusFund #SOP #TirumalaNews #DevoteeServices #AndhraPradesh
