March 24, 2026

టీటీడీ సిబ్బంది అభిమానం దెబ్బతీసే ప్రవర్తన తగదు

  • వేసవి రద్దీకి తగిన ఏర్పాట్లు
  • భక్తుల కోసం నిస్వార్థ సేవభక్తుల్ని రెచ్చగొట్టే వారికి కఠిన చర్యలు : టీటీడీ అదనపు ఈవో హెచ్చరిక

వేసవి సెలవులతో తిరుమల కొండపై భక్తుల రద్దీ తారాస్థాయికి చేరింది. ప్రతి రోజు లక్షలాదిమంది స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిబ్బంది రాత్రింబవళ్లు విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారని టీటీడీ అదనపు కార్యనిర్వాహకాధికారి (ఈవో) సి.హెచ్. వెంకయ్య చౌదరి అన్నారు.

శిలాతోరణం వద్ద ప్రారంభమయ్యే క్యూలైన్లను  ఆయన శనివారం స్వయంగా పర్యవేక్షించారు. అన్నప్రసాదాలు, పానీయాల పంపిణీపై భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సేవలపై అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు.

సహనం వీడి నినాదాలు – అసత్య ప్రచారాలు తగవు

ఓ వ్యక్తి అన్నప్రసాదం అందలేదంటూ నినాదాలు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కానీ టీటీడీ విచారణలో ఆ వ్యక్తి అస్వస్థతతో పాటు రద్దీపై అవగాహన లేకపోవడం వల్ల అసహనంతో వ్యవహరించినట్లు స్పష్టం అయింది. తన ప్రవర్తనపై పశ్చాత్తాపంతో క్షమాపణలు కూడా చెప్పినట్లు ఈవో తెలిపారు.

అధికారుల పర్యవేక్షణలో ప్రతి రోజు దాదాపు 60% మంది సాధారణ భక్తులకే దర్శన సౌలభ్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న టీటీడీ సిబ్బంది వల్ల ప్రతి రోజు అదనంగా 10,000 మందికి దర్శన అవకాశం కలుగుతుందని వివరించారు. అన్నప్రసాదం, టీ, కాఫీ, మజ్జిగ, స్నాక్స్ లాంటి సేవల పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టితో, చెత్త తొలగింపు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

తీవ్ర హెచ్చరిక:
భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం, నిర్దిష్ట వీడియోలు తీసి రెచ్చగొట్టే వారి పై చట్టపరమైన చర్యలు తప్పవని టీటీడీ అదనపు ఈవో స్పష్టం చేశారు. అధికారిక అనుమతి లేకుండా క్యూలైన్లలో చిత్రీకరణలు చేయడం సరికాదని, టీటీడీ పరిపాలనను అడ్డుకునే ప్రయత్నాలు ఉపేక్షించబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, హెల్త్ ఆఫీసర్ మధుసూదన్, వీఈజీఓ సురేంద్రతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *