
వాషింగ్టన్: స్వీడిష్ వాతావరణ కార్యకర్త గ్రీటా థన్‌బర్గ్ (Greta Thunberg) పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గాజాకు సహాయంగా వెళ్తుండగా ఇజ్రాయెల్ సైన్యం (Israeli Army) తనను, తనతోపాటు వెళ్ళుతున్న ఇతరులను అంతర్జాతీయ జలాలలో అరెస్ట్ చేసిందని గ్రీటా పేర్కొన్నారు.
దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ “ఆమె ఒక కోపంతో ఉన్న యువతి. ఆమెకు ఆవేశ నియంత్రణ తరగతులు (Anger Management Classes) అవసరం” అంటూ వ్యాఖ్యానించారు.
22 ఏళ్ల గ్రీటా థన్‌బర్గ్ గాజాలో మానవతా సంక్షోభం నేపథ్యంలో హ్యూమానిటేరియన్ ఎయిడ్ (Humanitarian Aid) తీసుకువెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న నౌకను ఇజ్రాయెల్ జలాల్లో అడ్డుకుని, అరెస్ట్ చేశారని ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కోలిషన్ (Freedom Flotilla Coalition) పేర్కొంది. షిప్ కమ్యూనికేషన్ కోల్పోయిన వెంటనే గ్రీటా ముందుగానే రికార్డు చేసిన వీడియోను వారు విడుదల చేశారు.
“మమ్మల్ని అడ్డుకున్నారు, అపహరించారు. ఇది అంతర్జాతీయ జలాల్లో జరిగింది. ఇది ఒక ఆక్రమణా చర్య” అంటూ గ్రీటా తన వీడియోలో వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందిస్తూ, “ఆ సెలబ్రిటీ బోటుకు నీళ్లు, సాండ్‌విచ్‌లు ఇచ్చేందుకు మాత్రమే ఆపాం” అని వివరణ ఇచ్చింది.
ట్రంప్ మంగళవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ (Benjamin Netanyahu)తో ఫోన్ కాల్‌లో మాట్లాడారు. అనంతరం మీడియా వారు గ్రీటా విషయమై ప్రశ్నించగా, “ఆమె ఒక రకంగా విభిన్నమైన వ్యక్తి. నిజంగా కోపంగానే ఉంది. నిజమైన కోపమో ఏంటో అర్థం కావడం లేదు. అయితే ఆవేశం చాలా ఎక్కువగా ఉంది” అని వ్యాఖ్యానించారు.
గ్రీటా థన్‌బర్గ్ 2019లో UN క్లైమేట్ సమ్మిట్‌లో ప్రపంచ నాయకులపై చేసిన వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అదే సమ్మిట్‌లో ట్రంప్‌ను తిడుతూ ఆమె చూపిన “ఘోర చూపు (Death Stare)” సోషల్ మీడియాలో వైరల్ అయింది.