March 27, 2026

గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ ‘మిసైల్’ హెచ్చరిక: “అమెరికా దక్కించుకోక తప్పదు!”

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ విషయంలో తన దూకుడును మరింత పెంచారు; ఆధునిక క్షిపణి వ్యవస్థలు మరియు యుద్ధ తంత్రాల దృష్ట్యా ఆ వ్యూహాత్మక దీవిని అమెరికా వశం చేసుకోవడం అత్యవసరమని, గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడం అమెరికాకు ఆప్షన్ కాదు.. ఒక అవసరమని ఆయన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

వ్యూహాత్మక అవసరం – ట్రంప్ ‘అక్వైర్’ మంత్రం

ట్రంప్ తన తాజా సందేశంలో “నవీన ఆయుధ వ్యవస్థల కాలంలో గ్రీన్‌లాండ్‌ను అక్వైర్ (స్వాధీనం) చేసుకోవడం చాలా ముఖ్యం” అని స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక ప్రయోజనాలే కాకుండా, ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా మరియు చైనాల ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి గ్రీన్‌లాండ్ అమెరికా రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన వాదిస్తున్నారు.

ఈ దీవి తమకు కావాలని, లేనిపక్షంలో డెన్మార్క్ సహా దీనిని వ్యతిరేకిస్తున్న దేశాలపై కఠినమైన వాణిజ్య ఆంక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ఫిబ్రవరి 1 నుంచి ఎనిమిది ఐరోపా దేశాల ఉత్పత్తులపై 10 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని ప్రకటించిన ట్రంప్, గ్రీన్‌లాండ్‌ను ఇచ్చే వరకు ఈ ఒత్తిడి కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

రాజకీయంగా విశ్లేషిస్తే, ట్రంప్ ‘గ్రీన్ లాండ్’ అంశాన్ని కేవలం ఒక రియల్ ఎస్టేట్ డీల్‌గా చూడటం లేదు. దీనిని అమెరికా భద్రతా ప్రయోజనాలతో ముడిపెడుతున్నారు. అమెరికాలోని తన మద్దతుదారుల నుంచి దీనికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండగా, నాటో (NATO) మిత్రదేశాలు మాత్రం దీనిని తమ సార్వభౌమాధికారంపై దాడిగా భావిస్తున్నాయి.

డెన్మార్క్ ప్రభుత్వం గ్రీన్‌లాండ్‌ను విక్రయించే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో, ట్రంప్ ఇప్పుడు ఆర్థికంగా ఐరోపాను ఉక్కిరిబిక్కిరి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు కెనడా చైనాతో బంధం పెంచుకుంటున్న తరుణంలో, అమెరికా తన చుట్టూ ఉన్న వ్యూహాత్మక ప్రాంతాలపై పట్టు కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటోంది.

ఐరోపాకు అల్టిమేటం – తదుపరి పరిణామాలు

ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఐరోపా దేశాలు కూడా దీటుగానే స్పందిస్తున్నాయి. డెన్మార్క్‌కు మద్దతుగా ఫ్రాన్స్, జర్మనీ దేశాలు గ్రీన్‌లాండ్ రక్షణకు సైన్యాన్ని పంపుతుండటం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. మరోవైపు, అమెరికా చట్టసభ సభ్యులు కొందరు ట్రంప్ చర్యలను వ్యతిరేకిస్తూ, గ్రీన్‌లాండ్‌పై సైనిక దాడిని నిషేధించే బిల్లులను ప్రవేశపెడుతున్నారు.

కానీ, ట్రంప్ తన అజెండాలో వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే సుంకాలు జూన్ నాటికి 25 శాతానికి పెరిగే అవకాశం ఉందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారీ కుదుపుకు గురిచేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *