ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 'జనవాణి'
తిరుపతి ఎమ్మెల్యే కార్యాలయంలో అర్జీల వెల్లువ.. 53 వినతులను స్వీకరించిన ఆరణి శ్రీనివాసులు!
ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ప్రత్యేక నజర్
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన ‘జనవాణి’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా ప్రజల నుండి 53 వినతులను స్వీకరించారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా విని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
అందిన వినతుల్లో అత్యధికంగా మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 21 అర్జీలు రాగా, రెవెన్యూ శాఖకు 7, పెన్షన్లకు సంబంధించి 6 దరఖాస్తులు అందాయి. అలాగే కలెక్టర్ కార్యాలయానికి 5, టీటీడీకి 3, విద్యుత్ శాఖకు 2 వినతులు వచ్చాయి. వీటితో పాటు కార్పొరేషన్ హెల్త్, ప్లానింగ్ విభాగాలకు సంబంధించి కూడా పలు సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
అటవీ శాఖ వసూళ్లపై వాకర్స్ ఫిర్యాదు
జనవాణిలో భాగంగా సీపీఎం జిల్లా నేత నాగరాజు ఎమ్మెల్యేకు ఒక కీలక వినతి పత్రం సమర్పించారు. దివ్యారామంలో వాకర్స్ నుంచి అటవీ శాఖ నెలకు వంద రూపాయలు వసూలు చేస్తోందని, దీనిని తక్షణమే నిలిపివేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, వెంటనే జిల్లా అటవీ అధికారి (DFO)తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే తిరుమలలోని తమ అంగడిని ఒక వ్యక్తి ఆరేళ్లుగా ఆక్రమించుకుని వేధిస్తున్నాడని ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా ఎమ్మెల్యే విచారణకు ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ‘జనవాణి’ని ప్రారంభించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ (PGRS) ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నామని, నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
నెలలో రెండు రోజులు జనవాణి నిర్వహణ
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా ప్రతి నెల మొదటి శనివారం మరియు మూడవ శనివారం ఎన్జీఓ కాలనీలోని తన కార్యాలయంలో ‘జనవాణి’ నిర్వహిస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు సత్వర న్యాయం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఆర్వో రవి, డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రయ్య, విద్యుత్ శాఖ ఏడీ ఆంజనేయులు మరియు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. వీరితో పాటు కార్పొరేటర్లు సీకే రేవతి, ఎస్ కే బాబు, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి మరియు ఇతర కూటమి నేతలు, సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
#Tirupati #Janavani #AraniSrinivasulu #Janasena #PublicIssues
