March 27, 2026

శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో హల్చల్: గోపురం ఎక్కిన నిందితుడు

తిరుపతిలోని చారిత్రక శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఏకాంతసేవ ముగిసిన తర్వాత ఒక వ్యక్తి మద్యం మత్తులో ఆలయ గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తం అయ్యేలోపే, అతను వేగంగా ఆలయ గోపురం పైకి ఎక్కి అక్కడ ఉన్న కలశాలను లాగే ప్రయత్నం చేయడంతో స్థానికులు, భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిందితుడిని నిజామాబాద్ జిల్లా కూర్మవాడ పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందిన తిరుపతిగా పోలీసులు గుర్తించారు. అత్యంత భద్రత ఉండే ఆలయ పరిసరాల్లోకి ఒక వ్యక్తి మద్యం మత్తులో ప్రవేశించి గోపురం ఎక్కడం అక్కడి నిఘా లోపాలను ఎత్తిచూపుతోంది.

మూడు గంటల ఆపరేషన్.. పోలీసుల అదుపులో నిందితుడు

గోపురంపై ఉన్న వ్యక్తిని కిందకు దించేందుకు పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది దాదాపు మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గోపురానికి నిచ్చెనలు వేసి, చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడా లేక ఏదైనా కుట్రతో ఈ పనిచేస్తున్నాడా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితుడి మానసిక స్థితిని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. పవిత్రమైన ఆలయ గోపురంపై ఇలాంటి ఘటన జరగడంపై భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

#tirupati #templesecurity #govindarajiswamy #securitybreach #crimenews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *