ఒడిశాలో ఎన్‌కౌంటర్
ఒడిశాలో జరిగిన (Maoist Encounter) ఎన్‌కౌంటర్‌లో మహిళా కేడర్ సహా ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు గురువారం ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్ కంధమాల్ జిల్లాలోని (Kandhamal District) బెల్ఘర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుమ్మా అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నట్లు తెలిపారు.
ఎన్‌కౌంటర్ ప్రాంతం నుంచి ఒక రివాల్వర్, 303 రైఫిల్, వాకీటాకీ సెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రహస్య సమాచారం ఆధారంగా ఒడిశా పోలీసులకు చెందిన (Odisha Police SOG) ఎస్‌ఒజి (స్పెషల్ ఆపరేషన్ గ్రూప్) మొబైల్ బృందం అడవిలో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులకు తెగబడటంతో ఎదురు కాల్పులు జరిగాయని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీపీఐ (మావోయిస్ట్) ఏరియా కమిటీ సభ్యులు బారి అలియాస్ రాకేష్, దళ సభ్యుడు అమృత్ మృతి చెందినట్లు తెలిపారు. వీరిద్దరిపై మొత్తం రూ.23.65 లక్షల రివార్డు ఉన్నట్లు పేర్కొన్నారు. గురువారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, అది మహిళా కేడర్‌కు చెందినదిగా అనుమానిస్తున్నామని, ఆమె గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు ఉన్నారనే అనుమానంతో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో డీజీపీ వైబీ ఖురానియా ఎదుట 22 మంది మావోయిస్టులు లొంగిపోయిన మరుసటి రోజే ఈ ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హమని పోలీసులు తెలిపారు.
#OdishaEncounter
#MaoistEncounter
#OdishaPolice
#Kandhamal
#SOG
#InternalSecurity
#AntiMaoistOperations