
రాజకీయ పునర్జన్మకు వేదికయింది కడప మహానాడు. దేవుని గడపగా భావించే ఈ పవిత్ర ప్రాంతం నుండి ప్రజాప్రభుత్వానికి మళ్లీ శక్తివంతమైన శుభారంభం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కడపలో జన సముద్రం తళతళలాడితే, టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెల్లివిరిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి మహానాడు ఘనవైభవంగా సాగింది. ఈ వేడుకల్లో సీఎం చేసిన వ్యాఖ్యలు రాయలసీమ రాజకీయం, రాష్ట్ర భవిష్యత్తుపై స్పష్టతను అందించాయి.
కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప గడప టీడీపీకి అడ్డా అయ్యిందని అన్నారు. రాయలసీమ గర్జనుగా మారిన ఈ మహానాడు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల హృదయాల్లో మారుమోగిందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మహానాడు దేవుని గడపగా పరిగణించే కడపలో నిర్వహించడం విశేషమని చెప్పారు.
ఈ బహిరంగ సభలో ప్రజల అపూర్వ హాజరును చూసి ధైర్యం పుంజుకున్నానని చంద్రబాబు వెల్లడించారు. ఎన్నిసార్లు కడపకు వచ్చినా ఇంతటి జనసంద్రం చూడలేదన్నారు. కడప టీడీపీ అడ్డా అని నిరూపించేందుకే ఇక్కడ మహానాడు నిర్వహించామన్నారు.
గత ఎన్నికల సమయంలో చెప్పినట్లే కడప గడపలో మార్పు ప్రారంభమైందన్నారు. అహంకారంతో విర్రవీగిన వారిని ప్రజలు అద్భుతమైన తీర్పుతో సమాధానమిచ్చారని వ్యాఖ్యానించారు. ఉమ్మడి కడప జిల్లాలో ఏడింటి పైగా స్థానాలు గెలుచుకున్నామని, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమికి 52 సీట్లలో 45 సీట్లు దక్కాయన్న సీఎం, రాయలసీమ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
మహానాడులో ఆయన చేసిన మరో ఆసక్తికర వ్యాఖ్య ఏమిటంటే—”టీడీపీ అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు. ఇది ప్రజల కోసం, అభివృద్ధి కోసం పుట్టిన ఉద్యమం.” అని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నేతలు ఎన్నో అవమానాలు, అక్రమ కేసులు, నిర్బంధాలకు సమాధానం చెప్పిన త్యాగాల ఫలితమే ఈ విజయం అన్నారు.
కడప మహానాడుకు కోడూరు నుంచి సైకిల్ మీద వచ్చిన కార్యకర్తను చూపిస్తూ.. ఇటువంటి కార్యకర్తలు ఏ పార్టీకైనా ఉండరని, వీరి వల్లే పార్టీ బలపడుతుందని చెప్పారు. ఇటువంటి కార్యకర్తలు ఉండడం పార్టీలో అదృష్టంగా అభివర్ణించారు.
రాబోయే రోజుల్లో భూ సమస్యలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. పింఛన్లను రూ.4000కి పెంచామని, రోడ్ల మరమ్మతులు, అన్న క్యాంటీన్లు, దేవాలయాల్లో అన్నదానం మొదలయ్యాయని గుర్తుచేశారు. బీసీల కోసం రూ.47 వేల కోట్లు కేటాయించామని చెప్పారు.
సూర్యఘర్ పథకంలో ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ఇస్తామని, వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్ ప్రోత్సహించామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు మొదటి తేదీన ఇవ్వడం మొదలైందని, రూ.7,500 కోట్ల బకాయిలు చెల్లించామని చెప్పారు.
ఆర్థిక ఉగ్రవాదులు, నకిలీ మద్యం, గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించిన చంద్రబాబు – “ఇక్కడ ఉంది సీబీఎన్, గుర్తుపెట్టుకోండి” అంటూ పదును పెట్టారు. అడవులను ఆక్రమించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.