కుష్టు వ్యాధి పట్ల వివక్ష వద్దు - చికిత్సతో సంపూర్ణ నివారణ సాధ్యం
మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జనవరి 30న స్విమ్స్ డెర్మటాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి. కుమార్ ఆదేశాల మేరకు నిపుణులు వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు.
స్విమ్స్ డీన్ డాక్టర్ అలోక్ సచన్ మాట్లాడుతూ, కుష్టు వ్యాధి ఒక సాధారణ జబ్బు మాత్రమేనని, దీనిపై సమాజంలో ఉన్న వివక్ష అమానవీయమని పేర్కొన్నారు. వ్యాధిని నిర్మూలించి, బాధితుల పట్ల మానవత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు.
కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజ్ కుష్టు వ్యాధి లక్షణాలను వివరించారు. చర్మంపై రంగు మారిన మచ్చలు, చేతులు, కాళ్లలో స్పర్శ తగ్గడం లేదా అంగవైకల్యం, అరికాళ్లు, అరచేతుల్లో నొప్పి లేని పుండ్లు.
ఇది తుంపర్ల ద్వారా మరియు దీర్ఘకాలికంగా రోగికి దగ్గరగా ఉండటం వల్ల మాత్రమే వ్యాపిస్తుంది. ప్రాథమిక దశలో గుర్తిస్తే లెప్రసీ మందులతో అంగవైకల్యం కలగకుండా పూర్తిగా నయం చేయవచ్చని నిపుణులు స్పష్టం చేశారు. “Leprosy is curable, the real challenge is stigma” (కుష్టు వ్యాధి నయం చేయగలదు, నిజమైన సవాలు సామాజిక కళంకమే) అనే థీమ్‌తో ఈ ఏడాది అవగాహన కల్పిస్తున్నట్లు డెర్మటాలజీ విభాగాధిపతి డాక్టర్ సురేఖ తెలిపారు.
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్: డా. చంద్రశేఖర్, డా. రమ, డా. హీరా గార్లు వ్యాధి గుర్తింపు మరియు చికిత్స విధానాలపై సమగ్ర సమాచారాన్ని అందించారు. రోగులకు, వారి సహాయకులకు కుష్టు వ్యాధి నివారణ జాగ్రత్తలతో కూడిన కరపత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డా. రామ్, ఆర్‌ఎంఓ డా. కోటి రెడ్డి మరియు వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
#WorldLeprosyDay #SVIMS #Tirupati #HealthAwareness #EndStigma #PublicHealth #TeluguHealthNews
