గ్రామాల్లో పింక్ బస్సుల సందడి.. ఇంటి వద్దకే క్యాన్సర్ పరీక్షలు
ఏర్పేడు మండలం పాపానాయుడుపేట పీహెచ్‌సీ పరిధిలోని కందాడు, వికృతమాల గ్రామాల్లో స్విమ్స్ వైద్యాధికారి డాక్టర్ ఎం. నాగరాజు ఆధ్వర్యంలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. అత్యాధునిక పరికరాలతో కూడిన ‘పింక్ బస్సు’ ద్వారా గ్రామస్తులకు అత్యంత ఖరీదైన పరీక్షలను ఉచితంగా అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో తిరుపతి జిల్లావ్యాప్తంగా ఈ అవగాహన మరియు స్క్రీనింగ్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మహిళలకు ప్రత్యేక నిధారణ పరీక్షలు
ఈ శిబిరంలో కేవలం సాధారణ పరీక్షలే కాకుండా, క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన కీలక పరీక్షలు నిర్వహించారు. మహిళలకు రొమ్ము క్యాన్సర్ గుర్తింపు కోసం మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కోసం పాప్ స్మియర్ పరీక్షలు చేశారు. అలాగే పురుషులు మరియు మహిళలకు నోటి క్యాన్సర్ పరీక్షలతో పాటు బీపీ, షుగర్ వంటి సాధారణ పరీక్షలు కూడా నిర్వహించారు. క్యాన్సర్ లక్షణాలను తొలి దశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయం చేయవచ్చని వైద్యులు ప్రజల్లో అవగాహన కల్పించారు.
సమన్వయంతో సాగిన వైద్య శిబిరం
స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో నిష్ణాతులైన వైద్య బృందం పాల్గొంది. కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె. నాగరాజ్ పర్యవేక్షణలో మెడికల్ ఆఫీసర్లు లావణ్య, పద్మావతి, హరిత మరియు ఇతర సిబ్బంది భక్తులకు సేవలందించారు. సర్పంచ్ కె. శ్రీదేవితో పాటు స్థానిక ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శిబిరాలు నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#SVIMS #PinkBus #CancerScreening #TirupatiNews #HealthAwareness #TTD #FreeMedicalCamp #CancerPrevention

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
