March 14, 2026

సూపర్ ఫాస్ట్ గా ‘సూపర్ సిక్స్’ అమలు: ఉండవల్లి శ్రీదేవి

UNDAVALLI SRIDEVI

UNDAVALLI SRIDEVI

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే ఎన్నికల హామీలను 95 శాతం నెరవేర్చి, నిజమైన ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుందని మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌తో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిందని, ముఖ్యంగా రాజధాని లేకుండా చేసిన జగన్ మోహన్ రెడ్డి వైఖరిని ఆమె తీవ్రంగా విమర్శించారు.


పెట్టుబడుల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీ మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందని శ్రీదేవి పేర్కొన్నారు. నారా లోకేష్ గారి చొరవతో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. విశాఖ సీఐఐ సమ్మిట్‌ ద్వారా రూ. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రావడం రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి నిదర్శనమని చెప్పారు. యువతకు ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని వివరించారు.

గత ప్రభుత్వ వైఫల్యాలు – అక్రమాలపై విమర్శలు

వైసీపీ హయాంలో కల్తీ మద్యం కారణంగా వేలాది మంది మహిళల మాంగళ్యాలు తెగిపోయాయని, రూ. 33 వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని ఆమె ఆరోపించారు. నవరత్నాల పేరుతో జగన్ నవ మోసాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. పేదలకు నివాసయోగ్యం కాని చోట ఇళ్ల స్థలాలు ఇచ్చి భారీ స్కామ్ చేశారని విమర్శించారు. వైసీపీ హయాంలో సంక్షేమం పేరుతో దోపిడీ జరిగిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే లబ్ధిదారుల సంఖ్యను పెంచి నిజమైన ప్రయోజనం చేకూరుస్తున్నామని స్పష్టం చేశారు.

సంక్షేమ పథకాల్లో సరికొత్త రికార్డులు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సామాన్యుడి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని శ్రీదేవి తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తున్నామని, గత ప్రభుత్వం కేవలం 42 లక్షల మందికే ఇచ్చిందని గుర్తు చేశారు. పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ కింద రూ. 20,000 పెట్టుబడి సాయం, ఉచిత గ్యాస్ సిలిండర్లు (దీపం 2) వంటి పథకాలు సూపర్ ఫాస్ట్ గా అమలవుతున్నాయని చెప్పారు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఇప్పటి వరకు 43 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని వెల్లడించారు.

అభివృద్ధి దిశగా అడుగులు

రాష్ట్రవ్యాప్తంగా 205 అన్న క్యాంటీన్ల ద్వారా కేవలం రూ. 5లకే నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, గత ప్రభుత్వం వీటిని రద్దు చేసి పేదల నోటి కాడ కూడు తీసిందని ఆమె ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం చేకూర్చామని, పోలవరం పనులు 85 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఒకటే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ఆమె వెల్లడించారు.

AndhraPradesh #SuperSix #UndavalliSridevi #ChandrababuNaidu #APDevelopment #WelfareState #NaraLokesh #SocialJustice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *