March 24, 2026

తెలంగాణలో ఒకేసారి మూడునెలల సన్నబియ్యం పంపిణీ 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీలో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా నెలనెలా పంపిణీ జరిగే బియ్యాన్ని ఈసారి మూడు నెలలకు సంబంధించి ఒకేసారి ఇవ్వనున్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సన్నబియ్యాన్ని జూన్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనివల్ల రేషన్ కార్డు దారులకు తరచూ రేషన్ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఒకేసారి మూడు నెలల కొరకు సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది.

సివిల్ సప్లయిస్ శాఖ నుంచి ఇప్పటికే తగిన ఆదేశాలు వెలువడగా, బాలాపూర్ మండలంలోని అన్ని రేషన్ షాపులకు సరుకులు చేరినట్టు సమాచారం. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల మొత్తం రోజుల్లో షాపులు పనిచేయనున్నాయి.

రేషన్ షాపుల పని వేళలు – వినియోగదారుల అవగాహనకు
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు ప్రతి రోజు రెండు విడతలుగా పనిచేయనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బియ్యం పంపిణీ ఉంటుంది. వినియోగదారులు ఈ వేళల్లో రేషన్ షాపులను సందర్శించి తగిన రేషన్ తీసుకోవచ్చు.

బాలాపూర్ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు టేకుల శశిధర్ రెడ్డి మాట్లాడుతూ – “మండలంలోని అన్ని గ్రామాలకు అవసరమైన బియ్యం వచ్చేసింది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీకి ఏర్పాట్లు చేశాం. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి,” అన్నారు. సెప్టెంబర్ లో తదుపరి సన్నబియ్యం పంపిణీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *