March 14, 2026

హెర్ముజ్ జలసంధి కాదు — నౌకలకు నరక ద్వారం

Strait of Hormuz లో చమురు ట్యాంకర్లు ప్రయాణిస్తున్న దృశ్యం (గాఫిక్)
  • హెర్ముజ్ వద్ద చిక్కుకున్న నౌకలు
  • ప్రపంచ చమురు రవాణాకు పెరుగుతున్న ముప్పు

“యుద్ధంలో మార్గాలను నియంత్రించినవారే విజేతలు అయ్యే అవకాశాలుంటాయి” — ప్రసిద్ధ సైనిక వ్యూహకర్త కార్ల్ వాన్ క్లాజ్‌విట్జ్ చెప్పిన ఈ మాట నేడు పర్షియన్ గల్ఫ్ తీరంలో అక్షర సత్యమవుతున్నట్టు కనిపిస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గంగా భావించే Strait of Hormuz ఇప్పుడు ఇరాన్ వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ సన్నని జలసంధి గుండా ప్రయాణించే నౌకలను కదలనివ్వకుండా ఇరాన్ చేస్తున్న హెచ్చరికలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చుతున్నాయి.కదలితే దాడులు తప్పవనే హెచ్చరికలతో భారీ నౌకలు పర్షియన్ గల్ఫ్ మీద జీవచ్ఛవాల్లా తేలియాడుతున్నాయి.

అరేబియా గల్ఫ్‌ను ఓమాన్ గల్ఫ్‌తో కలిపే ఈ జలసంధి భౌగోళికంగా చిన్నదే అయినప్పటికీ వ్యూహాత్మకంగా అపార ప్రాధాన్యం కలిగి ఉంది. సుమారు 167 కిలోమీటర్ల పొడవు, అత్యధికంగా 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ మార్గంలో నౌకాయానానికి అనుమతించిన మార్గం మాత్రం చాలా సన్నగా ఉంటుంది. అంతర్జాతీయ నౌకాయాన నియమాల ప్రకారం ఒక్కో దిశలో సుమారు మూడు కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న రెండు మార్గాల ద్వారానే భారీ నౌకలు ప్రయాణించాలి. ఈ కారణంగా భారీ చమురు ట్యాంకర్లు కచ్చితమైన మార్గంలో, నియంత్రిత వేగంతోనే ప్రయాణించాల్సి వస్తుంది. ఈ జలసంధిని ఒక వైపు ఇరాన్, మరో వైపు ఒమాన్ పంచుకుంటాయి.

ఈ మార్గం మూసుకుపోతే ప్రభావం కేవలం ప్రాంతీయంగా ఉండదు. Saudi Arabia, Iraq, Kuwait, United Arab Emirates, Qatar వంటి గల్ఫ్ దేశాల చమురు ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమవుతాయి. అలాగే India, China, Japan, South Korea వంటి పెద్ద ఇంధన వినియోగ దేశాలకు సరఫరా దెబ్బతింటుంది.

ప్రపంచ ఇంధన రవాణాలో ఈ మార్గం ఎంత కీలకమో గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. International Energy Agency అంచనాల ప్రకారం రోజుకు 18 నుంచి 21 మిలియన్ బ్యారెల్ల చమురు ఈ జలసంధి గుండా ప్రయాణిస్తుంది. ఇది ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు ఐదవ వంతు. అంటే దాదాపు 20 శాతం చమురు ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. U.S. Energy Information Administration ప్రకారం రోజుకు సుమారు 70 నుంచి 90 పెద్ద నౌకలు ఈ మార్గాన్ని ఉపయోగిస్తాయి. వాటిలో చాలా Very Large Crude Carriers (VLCC)— ఒక్కోటి దాదాపు రెండు మిలియన్ బ్యారెల్ల చమురు మోయగల సామర్థ్యం కలిగినవి.

ఈ భారీ నౌకల ప్రయాణం అంత సులభం కాదు. సాధారణంగా చమురు ట్యాంకర్లు సముద్రంలో 12 నుంచి 16 నాట్స్ వేగంతో ప్రయాణిస్తాయి.సన్నని మార్గాల్లో వేగాన్ని 10 నుంచి 12 నాట్స్ వేగంతోనే ప్రయాణించాల్సి వస్తుంది. అదీ మార్గం క్లియర్ గా ఉంటే, అక్కడ నౌకల రాకపోకలు పెరిగితే వేగాన్ని మరింతగా తగ్గించాల్సి ఉంటుంది.

ఒక భారీ చమురు నౌక (VLCC – Very Large Crude Carrier) సముద్రంలో ప్రయాణించే నౌకను నియంత్రించడమంటే, పట్టాలపై నడిచే రైలు కంటే కష్టమైన పని. నీటిపై వేగాన్ని తగ్గించడం తప్ప బ్రేకులు వేయడమనేది దాదాపు ఉండదు. అలాంటి 330 నుండి 400 మీటర్ల పొడవుండే ఈ మహానౌకలకు మలుపు తిరగడం అంత సులభం కాదు. నౌకాయాన పరిభాషలో ఒక నౌక 180 డిగ్రీల మలుపు పూర్తి చేయడానికి పట్టే దూరాన్ని ‘టాక్టికల్ డయామీటర్’ (Tactical Diameter) అంటారు.

సాధారణంగా ఒక భారీ నౌక మలుపు తిరగడానికి దాని పొడవుకు కనీసం 5 నుండి 8 రెట్ల దూరం అవసరమవుతుంది. అంటే, ఒక VLCC నౌక పూర్తి స్థాయిలో మలుపు తిరగాలంటే కనీసం 3 నుండి 5 కిలోమీటర్ల మేర సముద్రంలో ఖాళీ ప్రదేశం ఉండాలి. కానీ హెర్ముజ్ జలసంధిలో షిప్పింగ్ లేన్ వెడల్పు కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే. సాధారణ పరిస్థితులలో గంటకు 15 నాట్స్ (సుమారు 28 కి.మీ) వేగంతో వెళ్తున్న భారీ చమురు నౌక ఇంజిన్లను పూర్తిగా ఆపేసినా, అది నీటిలో ఉన్న తక్కువ ఘర్షణ వల్ల మరో 5 నుండి 7 కిలోమీటర్ల దూరం ముందుకు వెళ్ళి ఆగుతుంది.

ఏదైనా దాడి జరిగితే, ఒక భారీ నౌక అక్కడ పొరపాటున దారి తప్పినా లేదా శత్రువుల దాడి నుండి తప్పించుకోవడానికి హఠాత్తుగా మలుపు తిరగాలన్నా, దానికి తగినంత స్థలం ఉండదు. ఈ సాంకేతిక పరిమితులే ఈ జలసంధిని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా మార్చాయి. యుద్ధ పరిస్థితుల్లో లేదా అత్యవసర వేళల్లో ఇంతటి జడత్వం (Inertia) నౌకలకు శాపంగా మారుతోంది. శత్రువు దాడి చేస్తున్నప్పుడు నౌకను ఆపలేక, మలుపు తిప్పలేక అవి ‘సులభమైన లక్ష్యాలుగా’ మిగిలిపోతున్నాయి.

ఈ ప్రాంతం గతంలో కూడా ఉద్రిక్తతలను చూసింది. Tanker Warగా పిలవబడిన 1980ల కాలంలో చమురు నౌకలపై దాడులు, సముద్ర మైన్లు, క్షిపణి దాడులు సాధారణమయ్యాయి. అప్పట్లో అనేక నౌకలు దెబ్బతిన్నాయి. నౌకాయాన భద్రత కోసం అమెరికా సైన్యం Operation Earnest Will పేరిట చమురు నౌకలకు రక్షణ అందించాల్సి వచ్చింది. ఆ సంఘటనల వల్లే ఈ జలసంధి ఎంత సున్నితమైనదో ప్రపంచానికి స్పష్టమైంది.

ఇరాన్ హెచ్చరికల కారణంగా, తాజా సముద్ర రవాణా గణాంకాల ప్రకారం హెర్ముజ్ జలసంధి రెండు వైపులా ప్రస్తుతం 700కు పైగా నౌకలు వేచి ఉన్నాయి. వాటిలోనే 300కు పైగా భారీ చమురు ట్యాంకర్లు ఉన్నాయి. ఒక్కో నౌక సగటుగా రెండు మిలియన్ బ్యారెల్ల వరకు చమురు మోస్తుందని తీసుకుంటే, ప్రపంచ మార్కెట్‌కు వెళ్లాల్సిన దాదాపు అర బిలియన్ బ్యారెల్లకు పైగా చమురు సముద్రంలోనే నిలిచిపోయినట్లే.

యుద్ధం ఒక్కసారిగా ఆగిపోయినా ఇక్కడి సమస్య వెంటనే పరిష్కారం కాదు. హెర్ముజ్ జలసంధి వద్ద ఇప్పటికే వందలాది నౌకలు నిలిచిపోయాయి. రోజుకు దాదాపు 80 నుంచి 90 నౌకలు మాత్రమే ఈ మార్గం గుండా ప్రయాణించగలవని తీసుకుంటే, ప్రస్తుతం నిలిచిపోయిన ట్రాఫిక్ పూర్తిగా క్లియర్ కావడానికి కనీసం వారం నుంచి పది రోజులు పట్టే అవకాశం ఉంది. భద్రతా తనిఖీలు, బీమా ప్రక్రియలు, సముద్ర రవాణా నియంత్రణలను కలిపి చూస్తే పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి కనీసం పక్షం రోజులు పట్టవచ్చు.

హెర్ముజ్ వద్ద నిలిచిపోయిన నౌకలు కేవలం చమురు రవాణాను మాత్రమే కాదు, వేలాది సముద్ర కార్మికుల జీవితాలను కూడా నిలిపేస్తాయి. International Chamber of Shipping వివరాల ప్రకారం ఒక భారీ చమురు ట్యాంకర్‌లో సాధారణంగా 20–25 మంది సిబ్బంది పనిచేస్తారు. వందలాది నౌకలు అక్కడ వేచి ఉన్న పరిస్థితిలో టెక్నికల్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, సూపర్ కార్గో, ఆఫీసర్ ట్రైనీలు, కొన్ని సందర్భాల్లో కంపెనీ ఇన్‌స్పెక్టర్లతో కలిపి, 17,500-20,000 మంది సముద్ర కార్మికులు సముద్రంలోనే చిక్కుకుపోయినట్టే. మరోవైపు ఒక భారీ ట్యాంకర్ ఆలస్యం అయితే రోజుకు లక్ష డాలర్లకు దగ్గరగా demurrage ఖర్చు వస్తుంది. ఈ లెక్కన హెర్ముజ్ వద్ద నిలిచిపోయిన వందలాది నౌకల వల్ల రోజుకు కోట్ల డాలర్ల వ్యయం సముద్రంలోనే తేలుతున్నట్టే. ఒక అంచనా ప్రకారం ఈ ఆలస్యాల వల్ల రోజుకు సుమారు ₹850 కోట్ల వరకు ఖర్చు వస్తోంది

సాధారణంగా వాణిజ్య నౌకల్లో ఒక నెలకుపైగా సరిపడే ఆహారం నిల్వ ఉంచినా, తాజా సరఫరాలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ, యుద్ధ పరిస్థితుల్లో కొత్త సరఫరాలు చేరడం కష్టమవుతుంది. సముద్ర భద్రతా నివేదికల ప్రకారం ఫిబ్రవరి చివరి నుంచి ఇప్పటివరకు హెర్ముజ్ పరిసరాల్లో కనీసం పదిహేడు నౌకలు దాడులకు గురయ్యాయి. ఆ ఘటనల్లో ఆరుగురు సముద్ర సిబ్బంది మరణించగా మరికొందరు గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ నిలిచిపోయిన వందలాది నౌకల్లో పనిచేస్తున్న వేలాది సముద్ర కార్మికులు భయంతో, అనిశ్చితితో రోజులు గడుపుతున్నారు.

English Summary : The Strait of Hormuz is one of the world’s most critical maritime chokepoints, carrying nearly one-fifth of global oil supplies each day. Rising tensions in the region have left hundreds of vessels, including massive oil tankers, waiting near the narrow sea passage, raising concerns over global energy security. According to estimates from the International Energy Agency and the U.S. Energy Information Administration, about 18–21 million barrels of oil pass through this route daily, meaning any disruption could affect both major Gulf exporters and large energy-importing nations such as India, China, and Japan, while also leaving thousands of seafarers stranded at sea amid growing uncertainty.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *