
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం గురువారం ఉదయం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడానికి ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
ఈ పుణ్యకార్యక్రమాన్ని ఉదయం 6:45 గంటలకు ప్రారంభించారు. ఇందులో భాగంగా, శ్రీ గోవిందరాజస్వామివారి గర్భగుడితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఉపాలయాల గోడలు, పైకప్పులు, పూజా సామగ్రిని పవిత్ర జలంతో శుభ్రం చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
ఈ తంతు పూర్తయిన తర్వాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో ముని కృష్ణారెడ్డి, ప్రధాన అర్చకులు ఏ.పి. శ్రీనివాస దీక్షితులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.