
విశాఖపట్నం, జూన్ 8: దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న సింహాచలం శ్రీ వరహా లక్ష్మీనృసింహ స్వామి ఆలయం భక్తులతో కళకళలాడింది. ఆదివారం సింహగిరి భక్తులతో నిండిపోయింది. భక్తుల హరినామస్మరణతో సింహగిరి పులకించిపోయింది. సింహాద్రినాథుడు జన్మనక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా 119 జంటలు స్వామివారి స్వాతి హోమాన్ని వీక్షించారు.
ఆలయ అర్చకులు వేకువజామునే సింహగిరిపై ప్రభాత ఆరాధనలు పూర్తి చేశారు. ఆ తర్వాత సుదర్శన స్వామిని ఆలయ ఉత్తర రాజగోపురం వద్ద ఉన్న గ్రౌండ్‌లో (ground) ఏర్పాటుచేసిన ఆస్థాన మండపంలో ఆశీనులను చేశారు. ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజు స్వామి, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్‌ను వేదమంత్రాలతో, మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూజించారు.
ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో ఆలయ అర్చక స్వాములు కలశారాధన, మండపం, బింబాదరణలు పూర్తి చేశారు. అనంతరం భక్తులచే నృసింహ స్వామి అష్టోత్తర శతనామావళి పూజ చేయించారు. భక్తులు సింహాద్రినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అగ్ని ప్రతిష్ఠాపన, పంచ శుక్తులు, నృసింహ సుదర్శన మూలమంత్రాల అవహనం జరిపారు. మహా పూర్ణాహుతి పూర్తి చేసి కలశంతో ఆలయ ప్రదక్షిణ చేశారు. అందులోని పవిత్ర జలాలను భక్తులకు ప్రోక్షణం చేశారు. భక్తులకు వేద పండితుల ఆశీర్వాదం అందజేసి యజ్ఞప్రసాద వితరణ అనంతరం భక్తులంతా సింహాద్రినాథుడిని దర్శించుకుని సేవించుకున్నారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం (inconvenience) కలగకుండా ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ, స్వామివారి భక్తులకు అన్ని సదుపాయాలు (facilities) కల్పించారు.