March 27, 2026

పరిశ్రమలో మహిళల స్థితిగతులపై సమంత కామెంట్స్

SAMANTHA

SAMANTHA

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు వారి ప్రాధాన్యతపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, మహిళలు తమ గుర్తింపు కోసం ప్రతి దశలోనూ రెట్టింపు కష్టపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్ సెట్స్‌లో భద్రత అనేది ఒక చర్చాంశం కాకుండా, అది ప్రాథమిక హక్కుగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సమాజంలో ఇతరుల సౌకర్యం కోసం మహిళలు తమ అభిప్రాయాలను, షెడ్యూళ్లను మార్చుకోవడం అలవాటుగా మారిందని సమంత పేర్కొన్నారు. తమ వ్యక్తిత్వాన్ని, ఆశయాలను త్యాగం చేస్తూ ఇతరుల కోసం జీవించడం ఒక సాధారణ విషయంగా మారిపోవడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలు తమ కష్టాన్ని గుర్తించకుండా వెనక్కి తగ్గడం మానేయాలని, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

పురుషుల కంటే మహిళలే ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా క్షమాపణలు చెబుతారని, ఆ ధోరణిని ఇకనైనా వీడాలని సమంత సూచించారు. “ప్రతిదానికీ సారీ చెప్పడం ఇకనైనా ఆపాలి” అని ఆమె గట్టిగా చెప్పారు. మహిళలు తమ స్థానాన్ని స్వశక్తితో, అర్హతతో సంపాదించుకున్నారని.. ఎవరైనా ప్రశంసించినప్పుడు దాన్ని గర్వంగా స్వీకరించాలే తప్ప సంకోచించకూడదని ఆమె హితవు పలికారు.

భవిష్యత్తులో సినిమాలను ‘ఫీమేల్ లీడ్’ అని ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేని రోజు రావాలని సమంత ఆకాంక్షించారు. మహిళా పాత్రలు కేవలం హీరోలకు మద్దతుగా ఉండేందుకు మాత్రమే పరిమితం కాకూడదని, అవి స్వతంత్రంగా నిలబడాలని ఆమె స్పష్టం చేశారు. ప్రతి మహిళా నటి సెట్‌లో సురక్షితంగా ఉన్నామనే నమ్మకంతో పనిచేసే వాతావరణం ఉండాలని, అది పరిశ్రమకు ప్రాథమిక ప్రమాణంగా మారాలని ఆమె డిమాండ్ చేశారు.

Samantha #WomenEmpowerment #Tollywood #SamanthaRuthPrabhu #CinemaIndustry #GenderEquality #TrendingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *