April 4, 2026

అమరావతిపై చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు: సజ్జల

SAJJALA RAMAKRISHNA REDDY

SAJJALA RAMAKRISHNA REDDY

అమరావతి రాజధాని అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు తన దోపిడీ కోసమే అమరావతిని వాడుకుంటున్నారని ఆరోపించారు.

రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రంపై మోయలేని అప్పుల భారాన్ని మోపారని సజ్జల మండిపడ్డారు. గతంలో 8 శాతం వడ్డీకే రుణాలు దొరుకుతున్నా, 10.3 శాతం అధిక వడ్డీకి అమరావతి బాండ్లను తీసుకువచ్చి దానిని ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. “ఈ అప్పులను భరించేది, చెల్లించేది చివరకు ప్రజలే” అని ఆయన స్పష్టం చేశారు. అమరావతి ఇప్పట్లో పూర్తి కాదని, 2043 వరకు సమయం పడుతుందని చంద్రబాబే చెబుతున్నారంటే, అప్పటివరకు దోపిడీ చేయాలన్నదే ఆయన ప్లాన్ అని విమర్శించారు.

అమరావతి నిర్మాణం: చంద్రబాబు సీరియస్ ఈ వార్తను కూడా చదవండి

రాజధాని నిర్మాణం వల్ల ప్రభుత్వంపై బరువు పడకూడదన్నదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని సజ్జల పేర్కొన్నారు. 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నచోట రాజధాని కడితే సామాన్యులకు, మధ్యతరగతి వారికి మేలు జరుగుతుందని జగన్ భావించారని తెలిపారు. వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధిని జగన్ కోరుకుంటే, చంద్రబాబు మాత్రం కేవలం కాంట్రాక్టుల కోసమే అమరావతిని రీస్టార్ట్ చేశారని ఆరోపించారు. జగన్ తన ఇల్లు, పార్టీ కార్యాలయం ఇక్కడే కట్టుకున్నారని, కానీ చంద్రబాబు మాత్రం సొంత ఇల్లు కూడా కట్టుకోలేదని గుర్తుచేశారు.

అమరావతిపై తాము కులం ముద్ర వేయలేదని, చంద్రబాబే ఆ రంగు పులిమారని సజ్జల విమర్శించారు. పార్లమెంట్‌లో రేణుకా చౌదరి చేసిన ‘కమ్మరావతి’ వ్యాఖ్యలను టీడీపీ ఎంపీలు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. అమరావతిలో జరిగిన అవినీతిని తాము ప్రశ్నిస్తుంటే, ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. అసంబద్ధమైన ఆర్థిక సూత్రాలతో చంద్రబాబు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, కేవలం 7 బిల్డింగులు కట్టడానికి ఇంత హడావుడి అవసరమా అని నిలదీశారు.

ప్రభుత్వం పిలుపునిచ్చిన అమరావతి సంబరాలను ప్రజలు తిరస్కరించారని సజ్జల అన్నారు. అధికారులకు, ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. అప్పుల ద్వారా నగరాన్ని నిర్మించి, కంపెనీలకు జీఎస్టీ రాయితీలు ఇస్తూ ఆదాయం వస్తుందని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ప్రజలు చంద్రబాబు అబద్ధాలను, జగన్ చెప్పిన వాస్తవాలను బేరీజు వేసుకోవాలని ఆయన కోరారు.

#SajjalaRamakrishnaReddy #Amaravati #APPolitics #YSRCP #ChandrababuNaidu #AndhraPradesh #DebtBurden #CapitalCity

అమరావతి నిర్మాణం: చంద్రబాబు సీరియస్ ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *