March 27, 2026

బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు రూ.90.50 కోట్లు మంజూరు

వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు (BC Students Scholarships) కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025–26 విద్యా సంవత్సరంలో భాగంగా పీఎం యశ్వసి పథకం కింద రెండో విడతగా కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్న ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల నిమిత్తం రూ.90.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు.

శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, 2025–26 విద్యా సంవత్సరానికి గాను రెండో విడతగా రూ.69.40 కోట్లను (Post Matric Scholarships) పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం కేటాయించామని తెలిపారు. ఈ నిధులు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న బీసీ, ఈబీసీ, డీఎన్‌టీ విద్యార్థులకు ఉపయోగపడతాయని చెప్పారు.

అలాగే ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు రెండో విడతగా రూ.21.10 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో పాఠశాల స్థాయిలో చదువుతున్న అర్హులైన బీసీ, ఈబీసీ, డీఎన్‌టీ విద్యార్థులకు (Pre Matric Scholarships) స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్లు పేర్కొన్నారు.

రెండు ఉత్తర్వుల ద్వారా మొత్తం రూ.90.50 కోట్లను వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిందన్నారు. బీసీ విద్యార్థుల విద్యకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ చదువుకు దూరం కాకూడదన్నదే ఆయన లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు.

ఈ లక్ష్యానికి అనుగుణంగా పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లతో పాటు తల్లికి వందనం పథకం నిధులు బీసీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు పంపిణీ చేయడంతో పాటు, మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని, ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు, బీసీ గురుకులాల్లో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేసి ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

#BCStudents
#ScholarshipsAP
#PMYASASVI
#PostMatricScholarship
#PreMatricScholarship
#EducationWelfare

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *