‘మధుమేహ నొప్పికి ఫిజియోథెరపీతో ఉపశమనం’
తిరుపతి స్విమ్స్ (శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ) కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో ‘‘మధుమేహం వల్ల కలిగే నొప్పికి చికిత్స’’ అంశంపై సోమవారం వర్క్‌షాప్ నిర్వహించారు. స్విమ్స్ శ్రీ పద్మావతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు, ఉపకులపతి డా. ఆర్.వి.కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాబెటిక్ న్యూరోపతితో బాధపడే రోగుల్లో నొప్పి, పాదాల సమస్యలు, చలనశీలత తగ్గుదల వంటి సమస్యలు జీవన ప్రమాణాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని తెలిపారు. ఈ సమస్యలకు ఫిజియోథెరపీ సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుందన్నారు.
చెన్నై నుంచి వచ్చిన టోటల్ రీహెబ్ క్లినిక్ వ్యవస్థాపకులు డా. అల్పన ఖండేల్వాల్ డోంగ్రే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డయాబెటిక్ నొప్పి పునరావాస చికిత్సపై వివరించారు. వ్యాయామాలు, బ్యాలెన్స్ ట్రైనింగ్, గైట్ ట్రైనింగ్, ఎలక్ట్రోథెరపీ, పాద సంరక్షణ విద్యతో నొప్పిని తగ్గించి జీవనశైలిని మెరుగుపరచవచ్చని తెలిపారు.
ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపాల్ డా. మాధవి మాట్లాడుతూ ఈ వర్క్‌షాప్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.