కడప జిల్లా బద్వేలు సమీపంలోని అటవీప్రాంతంలో 14 ఎర్రచందనం దుంగలు, ఒక మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకుని, ఒక స్మగ్లర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
టాస్క్ ఫోర్స్ ఇంచార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ జి. బాలిరెడ్డి సూచనలతో కడప టాస్క్ ఫోర్స్ సబ్ కంట్రోల్ కు చెందిన ఆర్ ఐ చిరంజీవులు టీమ్ ఆర్ ఎస్ ఐ మురళీధర్ రెడ్డి బృందం గురువారం బద్వేలు సమీపంలో బ్రాహ్మణ పల్లి వద్దకు కూంబింగ్ కు వెళ్లారు.
ఆ ప్రాంతంలో కొందరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారిని విచారించడానికి వారి వద్దకు వెళ్లగా, వారు పోలీసులను చూసి పారిపోయారు.
వారిలో ఒకరిని పట్టుకోగా అతను నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో 14 ఎర్రచందనం దుంగలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు.
సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో అటవీ సిబ్బంది కూడా పాల్గొన్నారు