
దేశ భద్రత, సార్వభౌమాధికారంలో రాజీ ఉండదు: ఆర్మీ చీఫ్ అసిం మునీర్
బలప్రయోగం,బెదిరింపుల ద్వారా పాకిస్తాన్‌ను ఎవరూ వశం చేసుకోలేరని, దేశ ప్రాథమిక హితానికి అవసరమైన అన్ని చర్యలు మేము తీసుకుంటామని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ తెలిపారు. తాజా పరిణామాలపై ఆయన గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రకటన విడుదల చేశారు.
ఇండియా–పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇటీవల జరిగిన తీవ్ర కాల్పుల అనంతరం, పాకిస్తాన్ సైన్యం తమ ధోరణిని స్పష్టంగా వెల్లడించింది. ఎలాంటి బలవంతం లేదా బెదిరింపులు తమపై ప్రభావం చూపవని, దేశ భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమని పాక్ ఆర్మీ తెలిపింది.
ఈ మేరకు రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయంలో గురువారం 270వ కార్ప్స్ కమాండర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ నేతృత్వం వహించారు.
సరిహద్దు కాల్పులపై సమీక్ష
గత వారం సరిహద్దులో నాలుగు రోజుల పాటు తలెత్తిన కాల్పుల తరువాత భారత్, పాక్ పరస్పర కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ ఈ సమావేశం నిర్వహించింది. పాహల్గాం ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతిస్పందనగా పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా పాక్ సైనిక స్థలాలను లక్ష్యంగా చేసుకొని భారత్ దాడులు చేసింది.
ఈ దాడులకు సంబంధించి పాక్ సైన్యం, వ్యూహాత్మక సహనంతో, స్పష్టమైన ఆపరేషన్ విధానంతో స్పందించామని, తాము నియంత్రణను పాటించడమే కాక, మానవతా విలువలను కూడా కాపాడామని పేర్కొంది.
సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలి.
సైనికాధినేత అసిం మునీర్ మాట్లాడుతూ, పాకిస్తాన్ ప్రజలే తమ శక్తికి మూలమని, విదేశీ దాడులు, తీవ్రవాదం, మతదుర్మార్గతకు వ్యతిరేకంగా వారి విశ్వాసానికి అనుగుణంగా తాము నిత్యం సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
అలాగే బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ ఖ్వాలో తిరిగి పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపూ కూడా ఈ సమావేశంలో చర్చించారు. పాక్ భద్రతకు ముప్పు కలిగించాలనుకునే ఎవరికీ కూడా అవకాశం ఇవ్వమని కమాండర్లు స్పష్టం చేశారు.