కాకినాడ : కాకినాడ రూరల్ ఇంద్రపాలెం లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో అధికారులు సోదాలు నిర్వహించారు. బంక్ లో అవకతవకలు జరుగుతున్నాయనే ఫిర్యాదులతో సివిల్ సప్లయస్, లీగల్ మెట్రాలజీ శాఖల జిల్లా అధికారులు ప్రసాద్, సలీమ్ లు ఈ సోదాలు నిర్వహించారు.
ఆదివారం సాయంత్రం 5 గంటలకు బంక్ కు వద్దకు చేరుకున్న అధికారులు పెట్రోల్ డీజీల్ నమూనాలు సేకరించి క్వాలిటీ క్వాంటిటీ టెస్ట్ లు నిర్వహించారు. బంక్ నుంచి బౌజర్ వాహనం అనధికారికంగా డీజిల్ ను తరలిస్తున్నట్టు గుర్తించిన అధికారులు సదరు వాహనం గురించి ఆరా తీశారు. బౌజర్ వాహనం లో డీజీల్ తరలించేందుకు అనుమతులు లేవని పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి ప్రసాద్ స్పష్టం చేసారు.
అయితే తరచూ ఈ వాహనం లో వేల లీటర్ల డీజిల్ తరలిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో తాము సోదాలు నిర్వహిస్తున్నామని ప్రసాద్ వివరించారు.
సోదాలు నిర్వహించే సమయంలో బంక్ యజమాని రవి అక్కడకు చేరుకుని మీడియా పై అసహనం వ్యక్తం చేసారు. అధికారుల ఎదుటే మీడియా పై విరుచుకు పడ్డారు. బంక్ లో ఎటువంటి అవకతవకలు జరగడం లేదని వాదించారు. ఒకానొక దశలో అధికారులను సైతం బంక్ యజమాని రవి బెదిరించారు. తన బంక్ పై ఈ విధంగా కేసు నమోదు చేస్తారో చూస్తానంటూ బెదిరింపులకు దిగారు.
అయితే బంక్ లో సోదాలు నిర్వహించిన అధికారులు చివరకు బౌజర్ వాహనం లో డీజిల్ తరలించేందుకు సరైన అనుమతులు లేకపోవడం తో బంక్ యజమాన్యం పై కేసు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్ట్ కు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం పై మీడియా కు పూర్తి వివరాలను వివరించేందుకు అధికారులు నిరాకరించడం విశేషం..