హస్తినలో రహస్య వివాహం..
సామాజిక విప్లవమా? కుటుంబ ధిక్కరణా?
నవవధువు వరుడిగా మారడం ఏంటి? మరో అమ్మాయితో పెళ్ళి చేసుకోవడం ఏంటి? చెప్పేందుకు మీకు సిగ్గు లేకపోతే చదివేందుకు మాకు బిడయం ఉండాలి కదా? అనుకుంటున్నారు కదూ. మేము కూడా అలాగే అనుకున్నాం. కానీ, ఇది నిజం. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. మరో 14 రోజుల్లో పెళ్ళి ఉందనగా నవవధువు ఉన్నట్టుండి వరుడిగా మారిపోయింది. పెళ్ళి కూడా చేసేసుకుంది. ఆ కథేంటో తెలుసుకుందాం రండీ..
మురాద్‌పురా ప్రాంతంలో నివసిస్తున్న ఒక కార్మిక కుటుంబానికి చెందిన కుమార్తె లఖ్వీందర్ కౌర్ వివాహం జనవరి 14న జరగాల్సి ఉంది. ఆ కుటుంబం వివాహ సన్నాహాలు దాదాపు పూర్తి చేసింది. పెళ్ళి ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించారు. ఇంతలో, లఖ్వీందర్ కౌర్ స్నేహితురాలు సునీత పరారయ్యింది. నగలు నగదు తీసుకునే వెళ్ళిపోయింది. తనను తాను రత అని పిలుచుకుని పురుషుడిలా దుస్తులు ధరించిన సునీత, లఖ్వీందర్‌ను వివాహం చేసుకోవడానికి అనుమతించాలని కోరింది. తాను – లఖ్వీందర్ ఒకరినొకరు ప్రేమించుకున్నామని, స్వలింగ వివాహం చేసుకుంటామని ఆమె పేర్కొంది. ఆ మేరకు ప్రకటన కూడా చేసింది.
ఈ యువతులు పక్కా ప్లాన్ ప్రకారమే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెళ్లి కోసం సిద్ధం చేసిన నగలు మరియు లక్షల రూపాయల నగదును యువతి తనతో పాటు తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్టపరంగా స్వలింగ సంపర్కం నేరం కాకపోయినప్పటికీ, ఇంటి నుంచి నగదు మరియు వస్తువులను తీసుకెళ్లడం వల్ల దీనిని ‘దొంగతనం’ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, వరుడి కుటుంబం ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురై, తమకు జరిగిన అవమానానికి న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు.
తలపట్టుకుంటున్న పోలీసులు
తర్న్ తరణ్ పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వారి మొబైల్ సిగ్నల్స్, సోషల్ మీడియా యాక్టివిటీ ఆధారంగా ప్రస్తుతం వారు ఢిల్లీ లేదా దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ఆ యువతుల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, వారు మేజర్లు కావడంతో వారి వ్యక్తిగత నిర్ణయాలపై చట్టపరంగా ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చనే అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఈ ఘటన పంజాబ్ సరిహద్దు జిల్లాల్లో మారుతున్న యువత ఆలోచనా ధోరణికి నిదర్శనంగా నిలుస్తోందని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.
వివిధ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నివేదికల ప్రకారం, ఈ యువతులు తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావించి రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉందని సమాచారం. పోలీసులు వీరిని గుర్తించి, స్టేషన్‌కు తీసుకువచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ వారు స్వచ్ఛందంగా పెళ్లి చేసుకున్నామని నిరూపిస్తే, చట్టం వారి పక్షాన ఉండే అవకాశం ఉంది. అయితే, తీసుకువెళ్లిన నగదు మరియు నగలకు సంబంధించి వారు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. ఈ వింత పెళ్లి ఉదంతం ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
#punjab #samesexmarriage #secretwedding #missingcase #trendingnews