డబుల్ డయాఫ్రం వాల్ నిర్మించకుంటే పెను ప్రమాదమే..
మాజీ ఎంపీ జివి హర్షకుమార్..
రాజమహేంద్రవరం, డిసెంబర్ 7 : పోలవరం ప్రాజెక్టు ప్రాంతం భూకంప జోన్‌లో ఉందని, కాబట్టి ప్రాజెక్టును అత్యంత పటిష్టంగా నిర్మించాలని పార్లమెంట్ మాజీ సభ్యులు జివి హర్షకుమార్ ప్రభుత్వానికి సూచించారు.
స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశపు హాలులో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మనపోలవరం మన బాధ్యత అనే అంశంపై మాట్లాడుతూ ఇటీవల తెలుగు రాష్ట్రాలలో గోదావరి పరివాహక ప్రాంతంలోనే భూకంపం నమోదు అయ్యిందన్నారు. రిక్టర్‌స్కేల్‌పై ఇది 5.3గా నమోదు అయ్యిందన్నారు. భూకంపాలు అనేవి ఎప్పుడు వస్తాయో, ఎక్కడ వస్తాయో చెప్పిరావన్నారు. భూకంపం వచ్చిన తర్వాత దాని తీవ్రతను కొలిచే యంత్రాంగం ఉంది తప్పితే ఎప్పుడు, ఎక్కడ భూకంపం వస్తుందో ముందుగా తెలుసుకునే సాంకేతికత ఇంకా రాలేదన్నారు.
1969లో అదే ప్రాంతంలో భూకంప తీవ్రత 6.5గా నమోదు అయ్యిందని గుర్తు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతం భూకంపం జోన్ 3లో ఉందని చెబుతున్నారని, అయితే 1969లో వచ్చిన తీవ్రతను దృష్టిలో పెట్టుకుంటే అది జోన్4గానే భావించాలన్నారు. భూకంప జోన్ 4 అంటే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, భవనాలు, బ్యారేజ్‌లు కూలి తీవ్ర ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుందన్నారు.
పోలవరం డ్యాంలో కొన్ని లక్షల క్యూసెక్కుల నీటిని నిలువ ఉంచే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టును అత్యంత పటిష్టంగా నిర్మించాలన్నారు. పోలవరం డ్యాం నకు సంబంధించి డబుల్ డయాఫ్రం వాల్‌ను, హార్డ్ రాక్ వరకు పునాదులు వేసి నిర్మించాలని మొదటిగా నిర్ణయించబడిందన్నారు. అయితే తర్వాత ఇంజనీరులు సూచనల మేరకు సింగిల్ డయాఫ్రం వాల్‌తో సరిపెట్టారన్నారు. అదీ కూడా హార్డ్‌రాక్ వరకు పునాదులు వేయకపోవడం కారణంగానే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందన్నారు.
డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడంలో తప్పు పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వానిదేనన్నారు. అలాగే జగన్ ప్రభుత్వంలో గైడ్ బండ్ నిర్మాణాన్ని మెఘా కంపెనీకి అప్పగించారని, ఆ కంపెనీ నాణ్యత పాటించకపోవడంతో గైడ్ బండ్ కొట్టుకుపోయిందన్నారు. ఇప్పుడు అదే కంపెనీకి పోలవరం పనులు అప్పగించడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. అన్ని పార్టీలకు ఎలక్ట్రోల్ బాండ్‌లు ఇచ్చిన కారణంగానే ఆ కంపెనీకి పనులు అప్పగించారా అని ప్రశ్నించారు. జనవరి నుండి పోలవరం డయాఫ్రం వాల్ పనులు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్న నేపధ్యంలో డబుల్ డయాఫ్రం వాల్‌ను నిర్మించాలన్నారు. 2027లోగా పోలవరం పూర్తిచేయాలన్న కాలపరిమితులు విధించుకోకుండా నాణ్యతతో పటిష్టవంతంగా పోలవరం ప్రాజెక్టును నిర్మించాలన్నారు.
గత ఎన్నికల ముందు విశాఖపట్నంలో 25000 కేజీల కొకైన్ పట్టుబడిరదని, అది మీదంటే, మీదంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేసుకున్నాయని, అయితే ఇప్పుడు ల్యాబ్ టెస్ట్‌లో నెగెటివ్ వచ్చినట్లు కేంద్రం ప్రకటించడం, సరకును సంబంధీకులకు అప్పగించాలని ప్రకటించడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారం మేరకు సిబిఐ సరుకును పట్టుకుందని గుర్తు చేశారు. కొకైన్ మనిషి శరీరంలోకి వెళితేనే చాలా కాలం వరకు దాని ప్రభావం ఉండి డోపింగ్ టెస్ట్‌లో దొరికిపోతారని, అలాంటిది నేరుగా కొకైన్ అని సరుకు పట్టుబడినప్పుడు పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చి ఇప్పుడు ఎలా అది నెగిటివ్ రిపోర్ట్‌గా మారిపోతుందని ప్రశ్నించారు. ప్రజలను అమాయకులను చేయాలనుకుంటున్నారాని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు రాజు ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే వారిని చేసే విధంగా ఉన్నాయన్నారు. ఇలాంటి విధానాలపై ప్రజల నుండి పెద్ద విప్లవం రావడం ఖాయమన్నారు.