చిరు వ్యాపారులకు 'స్వనిధి' వరం: రూ. 30 వేల క్రెడిట్ కార్డు!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం స్వనిధి’ (PM SVANidhi) పథకంలో భాగంగా, వీధి వ్యాపారుల కోసం సరికొత్త యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డులను (UPI-linked RuPay Credit Card) ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా నెలకు రూ. 25 వేల పైన జీతం వచ్చే వారికే పరిమితమైన క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని, ఇప్పుడు చిరు వ్యాపారులకు కూడా కల్పిస్తూ ఏపీలోని తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించారు.
ఈ కార్డు ద్వారా ఒక్కొక్కరు రూ. 30,000 వరకు రుణ పరిమితిని పొందుతారు. కార్డులోని బ్యాలెన్స్‌ను వాడిన తర్వాత 20 నుండి 50 రోజుల లోపు తిరిగి చెల్లిస్తే, ఎటువంటి వడ్డీ వసూలు చేయరు. ఈ క్రెడిట్ కార్డు 5 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇది యూపీఐ (UPI) కి లింక్ అయి ఉంటుంది. దీనివల్ల క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి నేరుగా చెల్లింపులు చేయవచ్చు.
ఎవరు అర్హులు?
ఈ కార్డు అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం ఈ క్రింది వారు మాత్రమే అర్హులు. పీఎం స్వనిధి పథకంలో భాగంగా ఇప్పటికే మొదటి లేదా రెండో విడత రుణాన్ని తీసుకున్నవారు. తీసుకున్న రుణాన్ని సకాలంలో (Timely Repayment) తిరిగి చెల్లించి, మూడో విడత రుణానికి (రూ. 50,000) అర్హత సాధించిన వ్యాపారులు. వయస్సు 21 నుండి 65 ఏళ్ల మధ్య ఉండాలి. ఏ బ్యాంకు లేదా ఇతర క్రెడిట్ కార్డుల విషయంలో డిఫాల్ట్ (బకాయిలు) ఉండకూడదు.
తిరుపతిలో పైలట్ ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాన్ని తొలుత తిరుపతి జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 7,020 మంది చిరు వ్యాపారులు ఈ కార్డు పొందేందుకు అర్హత సాధించారు. త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర జిల్లాలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
#PMSVANidhi #CreditCard #AndhraPradesh #Tirupati #StreetVendors #FinancialInclusion #ModiSchemes #SmallBusinessSupport #TeluguNews
