చదువు పూర్తి.. వెనువెంటనే ఫైజర్‌లో ఉద్యోగం!
ఫైజర్ అటానమస్ టీమ్స్ (PAT – Pfizer Autonomous Teams) ప్రోగ్రామ్ కింద మూడేళ్ల క్రితం ఎంపికైన 118 మంది విద్యార్థినులు తమ బి.ఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీని పూర్తి చేసుకున్నారు. శుక్రవారం జరిగిన స్నాతకోత్సవంలో వీరికి పట్టాలతో పాటు నేరుగా ఫైజర్ కంపెనీలో నియామక పత్రాలను అందజేశారు.
ప్రోగ్రామ్ ప్రత్యేకతలు:
ఈ కోర్సును కేవలం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బాలికల కోసమే ప్రత్యేకంగా రూపొందించారు. డిగ్రీ చదివే మూడేళ్ల కాలంలో విద్యార్థినులకు అయ్యే ఖర్చును ఫైజర్ కంపెనీ భరించడంతో పాటు, వారికి శిక్షణను కూడా అందించింది. పారిశ్రామిక రంగంలో కెమిస్ట్రీ నిపుణుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గీతం వర్సిటీ ఈ కోర్సును రూపొందించింది.
“175 ఏళ్ల చరిత్ర గల ఫైజర్ సంస్థ ప్రపంచ ఫార్మా రంగంలో 5వ స్థానంలో ఉంది. గీతంతో కలిసి చేస్తున్న ఈ ప్రయోగం గ్రామీణ బాలికలకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలను కల్పిస్తోందని’’ మురళీధర శర్మ (ఫైజర్ విశాఖ అధిపతి) అన్నారు
“బాలికా విద్యకు ఫైజర్ ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయం. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే మా లక్ష్యం.” అని డాక్టర్ ఎరోల్ డిసౌజా (గీతం వైస్ ఛాన్సలర్) అన్నారు.
ఈ కార్యక్రమంలో గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ అనంతరామకృష్ణ, రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ ఎన్.వి.ఎస్. వేణుగోపాల్, కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ పి. మురళీధర్ మరియు ఫైజర్ ఉన్నతాధికారులు విజయ దత్తాత్రేయ, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
#Pfizer #GITAM #WomenEmpowerment #PharmaJobs #Visakhapatnam #EducationToEmployment #BScChemistry
