March 27, 2026

ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం: పవన్ కళ్యాణ్

దేవాలయాలే మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ చేసే ప్రతి భక్తుడికి కైలాసగిరి పుణ్యఫలం దక్కాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 42 ఆలయాల్లో మహాశివరాత్రిని అధికారికంగా నిర్వహిస్తున్నామని, ధూప దీప నైవేద్య పథకం కింద 5,821 ఆలయాలకు నెలకు రూ.10 వేల చొప్పున నిధులు అందిస్తున్నామని తెలిపారు. ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల్లో 5 వేల చిన్న ఆలయాల నిర్మాణానికి టీటీడీ సహకారంతో రూ. 750 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 2027 పుష్కరాల లోపు 495 పురాతన ఆలయాల పరిరక్షణకు రూ. 608 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రకటించారు.

22 కిలోమీటర్ల గిరి మార్గం.. రూ. 10 కోట్లతో అభివృద్ధి

సుమారు 22 కిలోమీటర్ల పొడవున్న ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని భక్తులకు అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దీని కోసం సుమారు రూ. 10 కోట్లు వెచ్చిస్తున్నామని, మార్గం ఇరువైపులా హరితీకరణ (గ్రీనరీ) చేపట్టి ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామన్నారు. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా గోదావరి పుష్కరాల కోసం 31 ప్రధాన ఆలయాలను రూ. 37 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.

భక్తుల సౌకర్యార్థం అధునాతన వసతులు: కలెక్టర్

జిల్లా కలెక్టర్ డాక్టర్‌ ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ, గత శివరాత్రి నాడు ఒక్క రోజే 35 వేల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేశారని గుర్తు చేశారు.  22 కిలోమీటర్ల మేర రాత్రి వేళల్లో ఇబ్బంది లేకుండా స్ట్రీట్ లైట్లు, మరుగుదొడ్లు, తాగునీరు మరియు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి నెలా పౌర్ణమి రోజున, కనుమ పండుగ మరియు శివరాత్రి సమయాల్లో భక్తులు ఈ మార్గాన్ని అత్యధికంగా వినియోగిస్తారని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హర్షం

2018లో తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి సౌకర్యాలతో భక్తులకు అంకితం చేయడం పట్ల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన పనులను వేగవంతం చేసి భక్తుల కష్టాలను తీర్చామని చెప్పారు. ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ, ఈ మార్గం అందుబాటులోకి రావడం వల్ల లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.

#PawanKalyan #Srikalahasti #GiriPradakshina #AndhraPradesh #Devotional #Mahashivaratri #SpiritualAP #AnamRamanarayanaReddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *