కాకినాడ ఎమ్మెల్యేకు పవన్ చురకలు..
పోర్టులో సుడిగాలి పర్యటన..
రేషన్ బియ్యం అక్రమ రవాణా పై మండిపాటు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన కాకినాడ పోర్టులో సుడిగాలి పర్యటన చేసారు.. ఈ సందర్బంగా టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుతో (వనమాడి వెంకటేశ్వరరావు)పాటు అధికారులపైనా ఆయన సీరియస్ అయ్యారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు అంశాన్ని ప్రస్తావిస్తూ.. అందరికీ చురకలు అంటించారు.
శుక్రవారం ఉదయం కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ తనిఖీలు నిర్వహించారు. ఆ టైంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెంట ఉన్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా.. రేషన్ బియ్యం విషయంలో కాంప్రమైజ్ అయ్యారా? అంటూ ఎమ్మెల్యే కొండబాబును పవన్ ప్రశ్నించారు. దీనికోసమేనా మనం పోరాటం చేసింది అంటూ అసహనం వ్యక్తం చేసారు.
ఇంత భారీగా బియ్యం దేశం దాటి వెళ్తుంటే.. ఏం చేస్తున్నారు?. ప్రతీసారి మాలాంటి వాళ్లు వచ్చిన ఆపితేగానీ.. ఇలాంటి అక్రమ రవాణా ఆపలేరా?. మీరు సరిగా ఉంటే పోర్టులోకి రేషన్ బియ్యం ఎలా వస్తాయి? అంటూ ఆయన అధికారులపై మండిపడ్డారు. ఆ టైంలో ఎమ్మెల్యే కొండబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోగా.. పవన్ పట్టించుకోలేదు.
అయితే.. ఆ పరిణామం జరిగిన కాసేపటికే మరోసారి కొండబాబును పవన్ టార్గెట్ చేశారు. ఈసారి టగ్గులో వెళ్తూ ఆయనపై మండిపడ్డారు. బిజినెస్ అంటే స్మగ్లర్ ను అనుమతించడం కాదు కదా అనడంతో కొండబాబు కంగుతిన్నారు. మనం ఏమీ చెయ్యకపోతే రేషన్ మాఫియాలో మన హస్తం ఉన్నట్లు ఉంటుందని పవన్ అన్నారు. దానికి.. రేషన్ బియ్యంపై విజిలెన్స్ ఎంక్వెయిరీ జరుగుతోందని చెప్పే ప్రయత్నం చేశారు కొండబాబు. అయినా కూడా ఆ మాటలు పట్టించుకోకుండా.. కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కేంద్ర హోం మంత్రికి, పీఎంవోలకు లేఖ రాస్తానని పవన్ అన్నారు.
ఇక.. రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు సముద్రంలో ప్రత్యేక బోట్ లో వెళ్లి మరీ పవన్ పరిశీలించడం గమనార్హం. తిరిగి సముద్రం నుంచి పోర్టుకు చేరకున్నాక.. ‘‘ఎస్పీ ఎందుకు కనిపించడం లేదు. నేను వచ్చే టైంకి ఎందుకు సెలవు తీసుకున్నారు. ఇదంతా చాలా బాగుంది’’ అంటూ పవన్ వ్యాఖ్యానించారు.