TTD: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివార్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ట నిర్వహించనున్నారు.
పవిత్రోత్సవాల కారణంగా అక్టోబరు 28 నుంచి 30వ తేదీ వరకు కల్యాణోత్సవం, అక్టోబరు 29న స్వర్ణపుష్పార్చన, అక్టోబరు 30న అష్టోతర శతకళశాభిషేకం సేవలు ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.