
- పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్‌లోకి అనుమతి లేదన్న లాహోర్ ఏటీసీ
- అతి కష్టం మీద సురక్షితంగా ల్యాండ్ అయిన ఇండిగో విమానం
ఒకవైపు తుఫాను, మరోవైపు వడగండ్ల వాన, విమానం ఊగిపోతోంది. పైలెట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. విమాన ముందుగా భాగానికి ఏదో గట్టిగా తగలింది. అత్యవసర ల్యాండింగుకు అనుమతించాలంటూ పైలట్ లాహోర్ ఏటీసీని కోరారు. అందుకు పాకిస్తాన్ ‘నో కుదరదు. మీ ప్రయాణీకులతో మాకేంటి?’ అంటూ నిరాకరించింది. వివరాలిలా ఉన్నాయి.
మే 21, బుధవారం నాడు ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో 6E 2142 విమానంలో 220 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు.
విమానాన్ని అమృత్‌సర్ మీదుగా తీసుకెళ్తున్న సమయంలో, పైలట్‌కు గాలివాన, వడగండ్ల తుపానును అనుభవించారు. అప్పటికే విమానం ముందు భాగం దెబ్బతింది. విమానంలో విపరీతమైన కుదుపులు వస్తున్నాయి. వెంటనే దారి మార్చాలని పాకిస్తాన్‌లోని లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు విజ్ఞప్తి చేశారు. కానీ, పాక్ ఏటీసీ అత్యవసర ల్యాండింగుకు నిరాకరించింది.
దీంతో విమానం కష్టమైనా సరే ప్రయాణాన్ని శ్రీనగర్‌కు తుపానులోనే కొనసాగించాల్సి వచ్చింది. ప్రయాణీకులు ప్రాణాలరిచేతిలో పెట్టుకుని ప్రయాణించారు. చివరకు పైలట్ విమానాన్ని నియంత్రించి శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. ఆయనకు అందరూ ప్రశంసించారు. దిగి చూస్తే విమానం ముందు భాగం బాగా దెబ్బతింది.
ఎవరికీ గాయాలు కాకపోవడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానానికి మరమ్మత్తులు చేపట్టనున్నట్లు ఇండిగో తెలిపింది.
విమానంలో ఉన్న టీఎంసీ ప్రతినిధి సంఘం సభ్యురాలు సాగరిక ఘోష మాట్లాడుతూ, ఇది మరణాన్ని తాకిన అనుభవమని, ప్రాణాలు పోతాయని అనిపించిందని, విమానం ఊగుతూ ప్రయాణికులు అరుస్తూ, ప్రార్థిస్తూ, భయాందోళనకు లోనయ్యారని వివరించారు.
ల్యాండయ్యాక, పైలట్‌ను వ్యక్తిగతంగా వెళ్లి ధన్యవాదాలు చెప్పామని తెలిపారు. విమానం ముక్కు భాగం పూర్తిగా దెబ్బతిన్నట్టు కనిపించిందని ఆమె చెప్పారు.