హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లకు అలవాటుపడిన ఓ యువకుడు, భారీగా అప్పులు చేసి అవి తీర్చలేక చివరకు తనువు చాలించాడు. కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఆన్‌లైన్ గేమింగ్ భూతం యువత జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేస్తుందో అనడానికి ఈ ఘటనే నిదర్శనం.
వివరాల్లోకి వెళ్తే.. సూరారంలో నివాసం ఉంటున్న రవీందర్ 24) అనే యువకుడు గత కొంతకాలంగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. తొలత వినోదం కోసం ప్రారంభించినా, ఆ తర్వాత డబ్బుల ఆశతో అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లు కట్టడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. జీవితంపై విరక్తి చెందిన రవీందర్, శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సెల్ఫీ వీడియోలో ఆవేదన – అప్రమత్తంగా ఉండాలని యువతకు హెచ్చరిక
చనిపోయే ముందు రవీందర్ ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో తన బాధను వ్యక్తపరుస్తూ.. ఆన్‌లైన్ గేమ్స్ వల్ల తాను నిండా మునిగిపోయానని, తన చావుకు మరెవరూ బాధ్యులు కాదని పేర్కొన్నాడు. ఈజీగా డబ్బు వస్తుందని నమ్మి మోసపోవద్దని, తనలాగా ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని ఆవేదన వ్యక్తం చేశాడు. యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరుతూ రవీందర్ చేసిన చివరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సూరారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధ తాళలేక యువకుడు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీల మాయాజాలంలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ, వారు స్మార్ట్‌ఫోన్‌లలో ఏయే యాప్స్ వాడుతున్నారో పర్యవేక్షించాలని సూచిస్తున్నారు.
#OnlineGamingSuicide
#HyderabadNews
#BettingAddiction
#YouthAlert
#CyberCrime Awareness