- అన్ని రిజిష్ట్రార్ కార్యాలయాలకు సరఫరా
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు అందుబాటులోకి రానున్నాయి. గతప్రభుత్వం తీసుకున్న ఈ స్టాంపింగ్ విధానానికి స్వస్తి పలుకుతూ నాన్ జుడీషియల్ పేపర్లను ప్రవేశపెడుతున్నారు.
ఈ స్టాంపింగ్ విధానం నాసిరకం కాగితాలను వినియోగించ డంపై క్రయవిక్రేతల నుంచి నిరసన వ్యక్తమైంది. జిరాక్స్ పేపర్ల మాదిరి ఉండటంపై ఆందోళన వ్యక్తం అయింది. ఉద్దేశ పూర్వకంగా స్టాంప్ పేపర్ల కొరతను సృష్టించి ఈ-స్టాంపింగ్ విధానాన్ని నాటి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. వాటిని సరిచేస్తూ నాన్ జుడీషియల్ స్టాంపులను ప్రవేశపెడుతున్నారు.
ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా, కమిషనర్ ఎం.శేషగిరిబాబులు సమీక్ష చేపట్టారు. క్రయవిక్రేతల అవసరాలకు తగ్గట్టు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లను రాష్ట్రంలోని 290 సబఖ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
వాస్తవానికి నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ల విక్రయంతో ప్రభుత్వానికి ఏటా రూ.50 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ.. అదే స్థాయిలో నష్టం వస్తుందంటూ ఈ-స్టాంపింగ్ విధానాన్ని మొదలు పెట్టింది.
ఇందులోని లొసుగులను గుర్తించిన న్యాయస్థానం ఈ స్టాపింగ్ కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. తీర్పుపై అప్పటి ప్రభుత్వం రివిజన్ పిటిషన్ సమర్పించి ఈ-స్టాంపింగును కొనసాగించింది. ఇదే శాశ్వతమని, నాన్ జ్యూడిషియల్ స్టాంపులు వాడబోమని మరీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ప్రచారం చేసింది.
ఆ మేరకు రిజిష్ట్రేషన్ శాఖ సీఎస్సీ, స్టాక్ హోల్డింగ్ సంస్ధలతో ఒప్పందం కుదుర్చకుంది. అయితే ఆ సంస్ధల్లో సీఎస్సీ సేవలు సక్రమంగా లేకపోవడం, ఆ సంస్ధ అధికారులు సీఎస్సీ ద్వారా స్టాంపుల అమ్మకాలకు అనుమతి ఇచ్చే విషయంలో అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు లేకపోలేదు.
కొందరు వెండార్ల వద్ద డబ్బు తీసుకుని లైసెన్సులు ఇచ్చిందనే ఆరోపణలు బాహాటంగా వినపడ్డాయి. దీనితో కూటమి ప్రభుత్వం ఈ స్టాంపులతోపాటు నాన్ జ్యూడిషియల్ స్టాంపుల అమ్మకాలకు నిర్ణయం తీసుకుంది.
నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ల సమీకరణ
రూ.10, రూ.20, రూ.50, రూ.100 నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్లను గతంలో తపాలా శాఖ ద్వారా విక్రయించడానికి సిద్ధం చేశారు. ప్రస్తుతం సుమారు రూ.కోటి విలువ కలిగిన నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్లు ఆ శాఖ వద్దే ఉన్నాయి.
వీటిని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలకు తెప్పించారు. రూ.50 విలువ ఉండే పది లక్షల స్టాంప్ పేపర్లు, రూ. 100 విలువ 10 లక్షల నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లను కూడా తెప్పించారు.
వాటిని రెండు రోజుల నుంచి ఆయా సబ్ రిజిష్ర్టారు కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ గిరిబాబు తెలిపారు.
రాష్ట్రానికి హైదరాబాద్ నుంచి రూ.20, నాసిక్ నుంచి రూ.50, రూ.100 విలువ స్టాంపులు ఏటా సుమారు రూ.120 కోట్ల విలువైనవి వస్తున్నాయని తెలిపారు. నాటి రిజిస్ట్రేషన్ శాఖ జి. రామకృష్ణ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై విజిలెన్స్ శాఖ విచారణ జరుపుతోంది.